దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరగటానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలే కారణమని కేంద్ర, ఎరువులు మరియు రసాయన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వ్యాఖ్యానించారు. బెజవాడ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ డబ్బు పంపిణీతో ప్రాంతీయ పార్టీల ఓటు చీలిందని కర్ణాటక రాజకీయలపై వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ తగ్గలేదని, కానీ ఇతర పార్టీల‌ ఓటు  కాంగ్రెస్ కి వెళ్లిందని అన్నారు. 2024 ఎన్నికలలో కర్నాటక లో మెజారిటీ ఎంపీ స్థానాలు సాధిస్తామని, తమిళనాడు, కేరళలో  బిజెపి బలోపేతం అవుతోందన్నారు. తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి తిరుగు లేదు..
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, జనసేన, బిజెపి పొత్తుతో ఏపీలో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఏదైనా చెబితే అది వారి సొంత అభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పురోగతి లేక అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని తెలిపారు. పార్టీ విధానంలో మేమంతా పని చేస్తామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్రం సహకారం అనే వాదనలో వాస్తవం లేదని కొట్టి పారేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కేంద్రం కోరుకుంటుందని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని,పోలవరం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి సరిగా లేదని వ్యాఖ్యానించారు. చేసిన పనులకు బిల్లులు పూర్తి గా ఇవ్వలేదన్నారు. మోడీ తొమ్మిదేళ్లలో పూర్తి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, మోడీ మంచి పాలన అందిస్తున్నారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. 2024 ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మోడీ హవాతో విజయం సాధిస్తామని,దేశ ఆర్ధికాభివృద్ధి ఎంతో పెరిగిందని చెప్పారు.
భారత్ లో పెట్టుబడులు పెరిగాయి..
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల నుంచి కూడా తరలి వస్తున్నారని, సుస్థిరమైన ప్రభుత్వం, సమర్ధవంతంగా మోడీ పాలనే ఇందుకు కారణం అన్నారు. మహారాష్ట్రలో శివసేన బిజెపితోనే ఉందన్నారు. మమతా బెనర్జీ, కేసీఆర్ విధ్వంసకర విధానాలు అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా మండిపడ్డారు.
భగవంత్ ఖుబాకు సాదర స్వాగతం..
నరేంద్రమోదీ పాలన అద్భుతమని కేంద్ర సహయ మంత్రి భగవంత్ ఖుబా అభిప్రాయపడ్డారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి  భగవంత్ ఖుబాకు గన్నవరం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఎయిర్ పొర్ట్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ లు కేంద్రమంత్రికి స్వాగతం పలికిన అనంతరం కొద్దిసేపు కేంద్రమంత్రి తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఏపీ నేతలతో కొద్దిసేపు ముచ్చటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మోడీ తొమ్మిదేళ్ల పాలనపై  కేంద్ర మంత్రి  స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్  లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు.
  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మోడీ తొమ్మిది ఏళ్ల పాలన పై అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడీ పాలనలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని తెలిపారు. మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని అంశాల వారీగా  ప్రజల్లోకి తీసుకెళతాం అని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల మోడీ పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ‌నిలిచిందని, అన్ని‌విధాలా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వైపే అందరూ చూస్తున్నారని తెలిపారు.