విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రేప్‌ కేస్‌ బాధితురాలిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. అధైర్య పడొద్దని న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


చంద్రబాబుతో మాట్లాడిన బాధితురాలి ఫ్యామిలీ... పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని చెప్పినట్టు టీడీపీ వెల్లడించింది. తమకు తెలిసిన వారితో అమ్మాయి కోసం వెతికామని చివరకు ఆసుపత్రిలోనే గుర్తించామన్నారు. 


బాధితురాలిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుందా అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందన్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ ఏదో ప్రాంతంలో జరుగుతున్నాయని.. ఇలాంటివి చూస్తుంటే అసలీ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా అని ప్రశ్న తలెత్తుతుందన్నారు. 


నిన్న నెల్లూరులో తిరుమల వెళ్తున్న ఫ్యామిలీని నడిరోడ్డుపై వదిలేసి పోలీసులే కారు ఎత్తుకెళ్లిపోయారని... అలాంటి వీళ్లకు ఆడపిల్లలు లెక్కే లేదన్నారు చంద్రబాబు. అక్కడ కారును ఎత్తుకెళ్తే.. ఇక్కడ ఆడపిల్లను ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇన్ని జరుగుతున్న సీఎం స్పందించకపోవడం అహంకారమా లేకా ఉన్మాదమా అని ప్రశ్నించారు. తన ఇంటి పక్కనే ఉన్న ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబు నిలదీశారు.  ఇప్పటి వరకు జరిగిన సంఘటల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 


ఇలాంటి సంఘటనలపై ఎవరైనా మాట్లాడితే తన చెంచాలతో తిట్టించడం జగన్‌కు అలవాటైపోయిందన్నారు చంద్రబాబు. ఇలాంటి వాటికి భయపడే రోజులు పోయాయని ఇకపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి పాలనపై ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. కొందరిలో మార్పు వచ్చిందని... ఇంకా మరికొందరు భయంతో సైలెంట్‌గా ఉండిపోతున్నారని అన్నారు. ఇప్పుడు భయపడితే రేపు మీకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారన్నారు. కేసులకు భయపడి సైలెంట్‌గా ఉండొద్దన్నారు. 


ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని తగుల బెడుతుంటే చూస్తూ ఊరుకోవద్దని ప్రజలకు సూచించారు చంద్రబాబు. జే బ్రాండ్స్‌తో కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కేరాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉందని.... ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు. గంజాయి, జే బ్రాండ్‌ మందు తాగి మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారన్నారు. 


సీఎం మాత్రం లేని దిశ చట్టాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారని మండి పడ్డారు చంద్రబాబు. జగన్‌కు దమ్ముంటే దిశ చట్టం పని చేస్తుంటే విజయవాడ గ్యాంగ్ రేప్‌ నిందితులకు ఉరి శిక్ష వేయించాలన్నారు. 24 గంటల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు పెట్టించి శిక్షలు విధించాలని సవాల్ చేశారు. అలా కాకపోతే బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. 


బాధితురాలు తలెత్తుకొని జీవించేలా ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కోటి రూపాయల సాయం అందివ్వాలన్నారు. ఫ్యామిలీ కోసం ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు.