Nara Lokesh Satires On Jagan Administration : ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ జాతయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్రాలు సంధించారు. రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో... కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనకు ప్రత్యక్షసాక్షి ఈ రోడ్డు అంటూ సెల్ఫీ తీసి.... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభ (Shankaravam Meeting)లో పాల్గొనేందుకు వెళ్తుండగా... మార్గం మధ్యలో ఈ రోడ్డు కనిపించింది. కంకరపర్చి వదిలేసిన ఈ రహదారి నారా లోకేశ్ కు కనిపించడంతో... దీనిపై స్థానికులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకపోవడంతో సగంలో వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు వెల్లడించారు.


కాంట్రాక్టర్లకు దాదాపు 2లక్షల కోట్ల బిల్లులు పెండింగ్


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా  కాంట్రాక్టర్లకు రూ.1.80లక్షల కోట్లు బకాయి పెట్టారని తెలిపారు. ఈ ప్రభుత్వం (YSRCP Government) పనులు చేయడం తమ వల్ల కాదని కాంట్రాక్టర్లు పారిపోతున్నారంటూ సెటైర్లు వేశారు. అధికార పార్టీ నాయకులకు అడ్డగోలు దోపిడీపై తప్పా... రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తిలేదని విమర్శించారు. జగన్ (YS Jagan) దిక్కుమాలిన పాలనకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


రేపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో లోకేశ్ పర్యటన


బుధవారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం కార్యక్రమం జరగనుంది. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం పదిన్నర గంటలకు మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారిని లోకేశ్ అభినందించనున్నారు. 10 గంటల 40 నిమిషాలకు పార్వతీపురం శంఖారావం సభలో యువనేత లోకేశ్ మాట్లాడనున్నారు. 11గంటలకు పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.నిర్వహిస్తారు. 11.30 గంటలకు పార్టీ కేడర్ కు లోకేష్ చేతుల మీదుగా బాబు సూపర్ - 6 కిట్ల అందజేయనున్నారు.


మధ్యాహ్నం సాలూరులో శంఖారావం


పార్వతీపురం నుంచి సాలూరు నియోజకవర్గం చేరుకుంటారు. రెండున్నర గంటలకు సాలూరు శంఖారావం సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించనున్నారు. మూడున్నరకు ముఖాముఖి నిర్వహించి...పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు బొబ్బిలి నియోజకవర్గానికి చేరుకుంటారు. 5 గంటలకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందించనున్నారు. 5 గంటల 15 నిమిషాలకు బొబ్బిలి శంఖారావం సభలో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించాక...పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేయనున్నారు. ఆరు గంటలకు రోడ్డు మార్గం ద్వారా రాజాం చేరుకుంటారు. ప్రయాణం. రాత్రికి రాజాంలోనే బస చేయనున్నారు.