తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆహ్వానం కూడా అందలేదన్నారు నాని. విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా పిలవలేదన్నారు.  ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ఆయన పార్టీ హైకమాండ్ ను ప్రశ్నించారు. అదే సమయంలో పార్టీ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇంచార్జులను గొట్టం గాళ్లన్నారు.  వేరే పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. తాను ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానో తనకు తెలుసు అన్నారు.   ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు కేశినేని నాని. ప్రజలకు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తారనని ధీమా వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్లను ప్రారంభించిన సందర్భంగా విజయవాడలోని తన ఆఫీస్ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. 


పార్టీలో ప్రయార్టీ లేదన్నట్టుగానే మాట్లాడిన నాని... మహానాడుకు తనను ఆహ్వానించలేదన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానం అందలేదన్నారు. ఓ పొలిట్ బ్యూరో సభ్యుడు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చారని అయినా తనను పిలవలేదన్నారు. 


గత కార్పొరేషన్ ఎన్నికల్లో తనను పార్టీ వాళ్లే  గొట్టంగాడని, చెప్పుతో కొడతానని తిట్టిన విషయాన్ని నాని గుర్తు చేశారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలన్నారు. లేకపోయినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రజలు తనతో చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. 


మహానాడులో తన కంట్రీబ్యూషన్ ఏమీ లేదన్నారు కేశినేని నాని. రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికి ఉన్న ప్రయార్టీ ఎవరికీ లేదన్నారు. వేరే వాళ్ల పాత్ర అక్కడ ఏమీ కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకని విలేకర్లు ప్రశ్నిస్తే ఈ విషయాన్ని చంద్రబాబునో అచ్చెన్నాయుడినో అడగాలని సూచించారు నాని. 


సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వ్యక్తి ఆఫీస్‌ ఓపెన్ చేస్తే తనకు ఆహ్వానం లేదన్నారు. సిట్టింగ్ ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని... అచ్చెన్న మాత్రం ఓపెనింగ్‌ వచ్చారన్నారు. దీని వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై కూడా ఎవర్నీ తాను ఏమీ అడగలేదన్నారు. 


తన వెంట ప్రజలు ఉన్నారని ప్రజల కోసం పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పొమ్మనలేక పొగబెడుతున్నారా అంటే దానికి కూడా అడగాల్సిన వాళ్లను అడగాలన్నారు. ప్రజలు అనుకుంటే ఇండిపెండెంట్‌గా గెలుస్తానన్నారు.


బెజవాడ తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చనీయాశంగా మారుతోంది. వరుసగా ఆయన చేస్తున్న కామెంట్స్‌తో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాసుకొని తిరగడంతో పార్టీ మార్పుపై పుకార్లు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెజవాడ పార్లమెంట్ స్దానం నుంచి నాని పోటీ చేస్తారంటూ పొలిటకల్ వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోంది. 


మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో కనిపించిన నాని వారం  రోజుల్లోనే  మరోసారి ఫైర్ అయ్యారు. అయితే తనుక చంద్రబాబు పీఏ పిలవడంతోనే ఆ మీటింగ్‌కు వెళ్లానని.. అసలు మీటింగ్ ఎందుకో ఎవరితోనో ఏం మాట్లాడుకున్నారో తనకు పూర్తిగా తెలియదని అన్నట్టు తెలుస్తోంది.