ఇసుక అక్రమ తవ్వకాలపై తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఆందోళనలతో బెజవాడలో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులపాటు ఆందోళనలు కొనసాగించిన తెలుగుదేశం నేతలు నేడు మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయం ముట్టడి తలపెట్టారు.


ఇసుకపై వరుస ఆందోళనలు...
అక్రమ ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై తెలుగు దేశం పార్టీ మూడు రోజులపాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇసుక దోపిడిపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, 40వేల కోట్ల రూపాయలు ఇసుక దోపిడీకి జగన్ కేంద్ర బిందువు అయ్యారని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు 48 గంటల్లో ఇసుక దోపిడిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. అయితే చంద్రబాబు ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. దీంతో 48 గంటల తరువాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన మూడు రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు. మొదటి, రెండు రోజులు ఇసుక అక్రమ రీచ్‌ల వద్ద నిరసనలు తలపెట్టి 30వ తేదీన మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీకి చెందిన శ్రేణులు ఇసుక అక్రమ క్వారీల వద్ద నిరసన తెలిపాయి. 


రంగంలోకి పోలీసులు
అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అయినా వాటిని లెక్క చేయకుండా, ఇసుక అనుమతులు, తవ్వకాల లెక్క తేల్చాలని తెలుగు దేశం పార్టీ నేతల పట్టుబడటంతో ప్రభుత్వం ఇరకాటంలోకి వెళ్ళిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇసుక దొంగలను అరెస్టు చేసి, ఉచిత ఇసుక విధానం తీసుకురావాలేని తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడే ఆందోళనలను అడ్డుకోవటంతోపాటుగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.


మైనింగ్ కార్యాలయం ముట్టడి ఉద్రికత్త...
రెండు రోజుల పాటు ఇసుక అక్రమ తవ్వకాలపై ఆందోళనలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నేడు ఇబ్రహీంపట్టణంలోని రాష్ట్ర మైనింగ్ కార్యాలయం ముట్టడికి పూనుకున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పార్టీ నాయకులకు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు కూడా చేశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటిని పోలీసులు అర్థరాత్రి నుంచి ముట్టడించారు. ఉమను బయటకు రాకుండా ఆపేందుకు ప్రయత్నించారు. అయినా మైనింగ్ కార్యాలయం ముట్టడిస్తానని దేవినేని ఉమా పట్టుబట్టారు. దీంతో ఆయన్ను పోలీసుల బలవంతంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


అరెస్టు చేసినప్పుడు దేవినేని ఉమ మాట్లాడుతూ జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో 123 వృత్తులు, వ్యాపారాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో జగన్ రెడ్డి మట్టి కొట్టారని, మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని 48 గంటల గడువు ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.