బెజవాడ దుర్గమ్మ ఆలయంలో మరో వివాదాం తెర మీదకు వచ్చింది. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూలపై కూర్చొని శానిటేషన్ ఉద్యోగి ఒకరు ఫోన్ మాట్లాడటం వివాదానికి కారణం అయ్యింది. భక్తులు వారిస్తున్నప్పటికి అతను పట్టించుకోకపోవటంతో, ఫోటోలు తీసి అధికారులకు షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది..
ఆ ఉద్యోగికి అక్కడ ఏం పని
ప్రసాదం కోసం టిక్కెట్లు విక్రయించే కౌంటర్‌లో శానిటేషన్ ఉద్యోగి వచ్చి కూర్చోవటంపై వివాదం తలెత్తింది. ఉద్యోగి కూర్చున్నంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ అతను లడ్డూ ప్రసాదంపై కూర్చోవటం ఇప్పుడు వివాదానికి కారణమైంది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. కళ్ళార చూసిన భక్తులు ఉద్యోగిని వారించేందుకు ప్రయత్నించినప్పటికి అతను లైట్ తీసుకున్నాడు. పైగా భక్తులపైనే ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
ఎంతకీ ప్రసాదంపై కూర్చొని లేవకపోవంతో భక్తులు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అమ్మ వారి ఆశీర్వాదం కోసం లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారు. కానుకలు, మొక్కుబడుల రూపంలో హుండీలో సమర్పించుకుంటారు. తీర్థప్రసాదాలు తీసుకొని తరిస్తారు.
అయితే అమ్మ వారి ఖజానా నుంచి జీతాలు తీసుకునే కొంతమంది ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరించటం చర్చనీయ అంశంగా మారుతోంది. అది కాస్త వైరల్ అయ్యింది. అమ్మవారి ఆలయం పవిత్రతపై ప్రభావం చూపుతుండటం భక్తులను ఇబ్బందులకు గురి చేస్తుంది. భక్తులు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావించే లడ్డూలపై కూర్చుని అపవిత్రం చేశారు.
తొలగించినా మరలా వచ్చాడు...
శానిటేషన్ విభాగంలో అవుట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న సుధాకర్‌ను గతంలో కొండపై కేక్ కట్ చేసిన ఘటనలో ఈవో విధుల నుంచి పూర్తిగా తొలగించారు. తాజాగా మళ్లీ విధుల్లో చేరిన సుధాకర్ తీరు మార్చుకోకపోగా... అమ్మవారి భక్తుల మనోభావాలు అవమానించే విధంగా వ్యవహరించడం వివాదంగా మారింది. శానిటేషన్ విభాగంలో ఉండాల్సిన సుధాకర్ మూడు వందల రూపాయలు స్కానింగ్ సెంటర్‌లో తిష్ట వేశాడు. ఐదు వందలు టిక్కెట్లు ఇచ్చే కేంద్రంలో అక్కడ ఉన్న ప్రసాదాలపై కూర్చుని పెత్తనం సాగిస్తున్నాడు. తనకు సంబంధం లేకపోయినా భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలపై కూర్చున్న ఫొటో కూడా గ్రూపుల్లో హల్ చల్ చేస్తుంది.
అసలు ఉద్యోగి స్థానంలో....
కౌంటర్‌లో విధుల్లో ఉండాల్సిన యన్.ఎం.ఆర్ ఉద్యోగి లేకుండా... సుధాకర్ ఆ విభాగంలో ఏం చేస్తున్నాడని చర్చ సాగుతుంది. ఒకసారి తొలగించిన సుధాకర్‌ను మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకున్నారో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈవో స్వయంగా తొలగించినా.. మళ్లీ తీసుకురావడం వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశంపైనా చర్చ నడుస్తుంది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని మరీ స్వీకరిస్తారు. కానీ ఇలా లడ్డూల పై కూర్చుని, అవే లడ్డూలను ప్రసాదాలుగా ఐదు వందల టిక్కెట్టు కొన్న వారికి అందించడం భక్తులు మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు అమ్మవారి సేవకులు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.