Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే దీన్ని లాకప్‌డెత్‌గా నిర్దారించిన సిట్ అధికారులు మరింత దూకుడుగా విచారణ చేస్తున్నారు. కేసులో కీలకంగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయికృష్ణ కేసులో మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక్కడే నడిపించే ఛాన్స్ లేదని గ్రహించిన సిట్ అధికారులు మరింత మందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మరికొందరు ఎవరు అనేది ఇప్పుడు కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో హాట్‌టాపిక్ అవుతోంది. నాగరాజుకు సన్నిహితంగా తిరిగిన వారు, సాయికృష్ణ కేసులో ఇన్వాల్వ్ అయిన వారందరూ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.
సాయికృష్ణ కేసులో మరికొందరి పాత్రపై ఆరా
సాయికృష్ణ కేసులో ఇన్‌స్పెక్టర్ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సిట్ అధికారులు మరింత సమాచారం కోసం లోతుగా దర్యాప్తు స్టైల్ మారుస్తున్నారు. సాయికృష్ణను హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేయడంలో నాగరాజుకు మరికొందరి సహకారం ఉందని నిర్దారణకు వచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారితో ఓ ప్రైవేట్ వ్యక్తి పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తి స్టేషన్‌కు తరచూ వచ్చి వెళ్లే వారని సమాచారం. అందుకే ఆ వ్యక్తి సమాచారం సేకరిస్తున్నారు.
కీలక విషయాలపై నోరు విప్పని నాగరాజు
మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన విషయాన్ని వాంగ్మూలాల ఆధారంగా అధికారులు నిర్దారించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సేకరించిన నమూనాల ఆధారంగా సాయికృష్ణ మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసులో కీలక పురోగతి ఉన్నప్పటికీ మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదు. అరెస్ట్ అనంతరం నాగరాజును గంటల తరబడి సిట్ అధికారులు విచారించారు. ఆయన మాత్రం దేనికీ సమాధానం చెప్పడం లేదు. కీలక ప్రశ్నలకి కూడా నాగరాజు నోరు విప్పడం లేదు. అందుకే వేరే రూట్‌లో సిట్ అధికారులు విచారణ మొదలు పెట్టనున్నారు. నాగరాజుకు సన్నిహితంగా వ్యవహరించిన సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు.
వారి అరెస్టు తప్పదా?
మృతదేహం ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. కోర్టుకు కూడా సిట్ దర్యాప్తు కోసం ఎదురు చూస్తోంది. వారు విచార చేసిన అనంతరం కేసుపై కోర్టులో మరోసారి వాదనలు జరగనున్నాయి. ఓ వైపు కోర్టు, మరోవైపు ప్రభుత్వం ఇలా అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నందున కేసును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే నాగరాజు సన్నిహితులపై దృష్టి పెట్టారు. అయితే వారు కూడా విచారణకు సహకరిస్తే సరే లేకుంటే వారిని కూడా అరెస్టు చేసే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది.
సాయికృష్ణది లాకప్‌డెత్‌గా తేల్చినప్పటి నుంచి నాగరాజుకు సన్నిహితంగా ఉండే సిబ్బంది, మరికొందరు వ్యక్తులు అజ్ఞాతంలోకి జారుకున్నారు. వారికి ఏ క్షణంలోనైనా పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. వారందరి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణం ఎలాంటి విషయాలు వినాల్సి ఉంటుందో అని భయం భయంగా కాలం గడుపుతున్నారు. మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా తన బిడ్డ కేసులో మరికొందరి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సిట్ దర్యాప్తు కూడా ఆ దిశగానే సాగుతోంది.
