Andhra Pradesh Liquor Case :ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ అనేక మలుపు తిరుగుతోంది. దేశ సరిహద్దులను కూడా దాటిపోతోంది. ఇందులో తెలంగాణలోని కీలక వ్యక్తుల పాత్ర కూడా వెలుగు చూస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు లిక్కర్ స్కామ్‌లో కూడా జోక్యం చేసుకున్నట్టు తేలింది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు విచారణకు పిలిచారు. సిట్ పిలుపు మేరకు శ్రవణ్‌రావు విజయవాడలో విచారణకు హజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో డబ్బులను హవాలా రూపంలో చేతులు మారినట్టు సిట్ తేల్చింది. ఇలాంటి డబ్బులను మార్చేందుకు చాలా పెద్ద నెట్‌వర్క్ పని చేసిందని మొన్న కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇలాంటి నెట్‌వర్క్‌లోని కీలక వ్యక్తులకు ఈ శ్రవణ్‌కుమార్ షెలర్ట్ ఇచ్చినట్టు స్పష్టమైంది. దుబయ్‌లో తనకు ఉన్న ప్లాట్‌లోనే నిందితులుగా ఉన్న చాణక్య, కిరణ్‌కు ఆశ్రయం ఇచ్చారని తేల్చారు.
ప్రస్తుతం శ్రవణ్ రావు తెలంగాణలో దర్యాప్తు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఐటీ సలహాదారుగా పని చేసిన శ్రవణ్‌రావు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌లో జోక్యం చేసుకున్నారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఆయనకు రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. గురువారం విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు.
లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్మును దుబయ్ చేరవేయడంలో కిరణ్‌కుమార్ కీలక పాత్ర పోషించారని సిట్ ఇప్పటికే ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కిరణ్‌తోపపాటు చాణక్య కొరియర్లుగా వ్యవహరించాలని తెలిపింది. కిరణ్ అనేవ్యక్తి ఇప్పటి వరకు 29 సార్లు దుబయ్ వెళ్లినట్టు కూడా తెలిపింది. వెళ్లినప్పుడల్లా శ్రవణ్ ఫ్లాట్‌లోనే ఉన్నట్టు నిర్దారించారు. దాన్ని షెల్టర్‌గా లిక్కర్ స్కామ్ నిందితులు వాడుతున్నట్టు తేల్చారు. వీళ్లంతా ఆ ఫ్లాట్‌లో ఉన్నప్పటికీ ఖాళీగా ఉన్నట్టే శ్రవణ్ చూపించారని స్పష్టమైంది. దీంతో ఆయన్ని పిలిచి ఈ విషయాలపై ప్రశ్నిస్తున్నారు.
శ్రవణ్ కేవలం ఫ్లాట్ అద్దెకు ఇచ్చారా లేకుంటే హవాలలో కూడా ఆయన పాత్ర ఉందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. అక్కడకు వచ్చిన తర్వాత కిరణ్, చాణక్య ఏం చేసేవాళ్లు. వీళ్లతో ఆయనకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆ ఫ్లాట్‌లో వీళ్లు ఉన్నట్టు సాంకేతిక ఆధారాలు సేకరించిన అధికారులు వాటిని ఆయన ముందు పెట్టి ప్రశ్నించనున్నారు. బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా చెక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డికి కూడా శ్రవణ్‌కుమార్‌కు సాన్నిహిత్యం ఉందని తేలింది. ఆ వివరాలపై కూడా కూపీ లాగతున్నారు.