Remand for Dhatri Madhu : విజయవాడ: వైసీపీ హయాంలో జరిగిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల వాల్యుయేషన్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల వాల్యువేషన్లో పాల్గొన్న సతీష్ అనే నందిగామకు చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడ్ని విజయవాడ స్వర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఏ2గా ఉన్న క్యామ్‌సైన్ డైరెక్టర్ ధాత్రి మధుకు విజయవాడ కోర్టు మే 21వరకు రిమాండ్ విధించింది.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పరీక్షల అక్రమాల కేసులో సతీష్ ను పోలీసులు ఇటీవల రెండు రోజుల పాటు విచారించారు. విచారణకు వెళ్లి వచ్చిన రెండో రోజు నందిగామకు చెందిన సతీష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. సతీష్ ఆత్మహత్యాయత్నం విషయాన్ని బయటకు రాకుండా పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు సీక్రెట్‌గా ఉంచారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో వాల్యూ వేషన్లో పాల్గొన్న 60 మందిని పోలీసులు విచారించారు. సతీష్ గతంలో నందిగామలో ఓ ప్రవేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశాడని సమాచారం.
ఏపీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో ధాత్రి మధుకు రిమాండ్‌రాష్ట్ర గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్రూప్ 1 స్కామ్ కేసులో ఏ2గా ఉన్న క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ (ధాత్రి మధు) డైరెక్టర్‌గా ఉన్నారు. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి, ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ వాల్యుయేషన్లో భారీ అక్రమాలకు క్యామ్‌సైన్ తెరలేపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. హాయ్‌ల్యాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనమే చేపట్టలేదని గుర్తించారు. కానీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు మూల్యాంకనం చేసినట్లుగా నమ్మించేందుకు అర్హత లేని వ్యక్తులను తాత్కాలికంగా నియమించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే వాల్యుయేషన్ గురించి ఏమాత్రం అవగాహన లేని గృహిణులు, చంటి బిడ్డల తల్లులను పేపర్ల వాల్యుయేషన్ కోసం తాత్కాలికంగా నియమించుకుని నాటకం ఆడటంతో కథ అడ్డం తిరిగిందని అధికారులు తెలిపారు. జవాబు పత్రాలను తాము కనీసం తెరిచి చూడలేదని, క్యామ్‌సైన్ మేనేజ్‌మెంట్ చెప్పిన విధంగా మార్కులు మాత్రమే వేసినట్లు వాల్యుయేషన్ చేసిన కొందరు విచారణలో ఒప్పుకున్నారని సమాచారం. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10 లోని క్యామ్‌సైన్ ఆఫీసులో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు మధుసూదన్ (ధాత్రి మధు)ను మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం అతడిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. మరుసటిరోజు విజయకోర్టులో ప్రవేశపెట్టగా రెండు వారాలపాటు రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ జైలుకు మధుసూదన్‌ను తరలించారు.