జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రచార రథం వారాహికి ఆలయంలో వాహనపూజ నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ తొలిసారి వారాహి వాహనం పైకి ఎక్కి ప్రసంగించారు. అక్కడి నుంచే ఆయన జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. పవన్ కల్యాణ్ దుర్గ గుడికి రావడంతో పక్కనే ఉన్న ఫ్లైఓవర్ సహా రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. పవన్ కల్యాణ్ ను చూసిన జనం హుషారుతో, ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






తొలుత ఆలయానికి కారులో చేరుకున్న పవన్ కల్యాణ్ దుర్గమ్మను దర్శించుకున్నారు. పవన్‌కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశాక, వాహనానికి పవన్ పూజ చేయించారు.


అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలను పవన్ కళ్యాణ్ సమర్పించారు. పవన్ కళ్యాణ్ కి, నాదెండ్ల మనోహర్ కి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో భ్రమరాంబ, అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.








ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చానని అన్నారు. కొండగట్టులో వారాహికి పూజలు చేయించానని, ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. ఆంధ్ర అంతా సుభిక్షంగా ఉండాలి. కొత్త లీడర్లు రావాలని ఆకాంక్షించారు. రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి లక్ష్యం అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.






అనంతరం జనసేనాని మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నేతలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైఎస్ఆఱ్ సీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.