తెలుగుదేశం పార్టీలో గన్నవరం రాజకీయం రంజుగా మారబోతోంది. పాత నాయకులందర్నీ ఎకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. ఇందుకు తారక రామ మందిరం ప్రారంభం వేదిక కాబోతోందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
త్వరలో మందిరం ప్రారంభం...
నందమూరి, నారా కుటుంబాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహరంలో మాజీ శాసన సభ్యుడు దాసరి బాలవర్దనరావు కీలక అడుగులు వేశారు. 2019 తరువాత వైసీపీకి దగ్గరయిన దాసరి బాలవర్దనరావు, దాసరి జైరాం రమేష్ ఇప్పుడు తిరిగి టీడీపికి దగ్గరయ్యారు. తారక రామ మందిరం ఉంగుటూరు మండలం ఉంగుటూరులో నిర్మిస్తున్నట్లు స్వయంగా దాసరి బాలవర్దనరావు తెలిపారు. రామారావు, బసవతారకం విగ్రహాలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవం చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గన్నవరం, గుడివాడ శాసన సభ స్థానాలను తిరిగి టీడీపీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి సహా ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు అందర్నీ ఆహ్వానిస్తున్నామని దాసరి బాలవర్దనరావు తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు... దాసరి 
గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు మాట్లాడుతూ.... దివంగత నేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో తమకు అనుబంధం ఉందన్నారు. తారక రామ మందిరం ఉంగుటూరు మండలం ఉంగుటూరులో నిర్మిస్తున్నామని, రామారావు, బసవతారకం విగ్రహాలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేతులు మీదుగా త్వరలో ప్రారంభోత్సవం చేయిస్తామని తెలిపారు.
చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరకి ఆహ్వానిస్తున్నామని, వారి చేతులు మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగుతుందన్నారు. తన మీద అభిమానంతో తెలుగు దేశం నాయకులు తన ఫొటోతో ప్లక్సీ లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. 2019 లో రాజకీయ పరిణామాలు వలన తనతో పాటుగా దాసరి జై.రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళామని తెలిపారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో తమకు సభ్యత్వం కూడా లేదన్నారు. ఎన్నికల తరువాత వైఎస్ఆర్ సీపీలో ఎటువంటి కార్యక్రమాల్లో కూడ పాల్గొనలేదన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలా లేదా అనేది సోదరుడు జై రమేష్ తో కలసి ఆలోచన చేస్తామన్నారు దాసరి బాలవర్దనరావు.
గన్నవరం, గుడివాడలపై ఫోకస్...
తెలుగు దేశం పార్టీ నేతలు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో పాటుగా గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ జెండాను ఎగర వేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో ఉన్న శాసన సభ్యులు వల్లభనేని వంశీ, కొడాలి నానిలను ఎట్టి పరిస్దితుల్లో ఓడించటమే లక్ష్యంగా తెలుగు దేశం ప్రయత్నాలు మెదలుపెట్టింది. అందులో భాగంగానే గన్నవరానికి చెందిన మాజీ నేతలను తిరిగి పార్టిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించటంతో పాటుగా, పార్టీకి గెలిపించటమే అంతిమ లక్ష్యంగా పెట్టుకుంది. దాసరి బాలవర్దనరావు, దాసరి జైరాం రమేష్ ఇద్దరు కీలక నేతలు గతంలో తెలుగు దేశం పార్టిలో గన్నవరం నుండి కీలకంగా వ్యవహరించారు. అయితే కాలక్రమంలో ఇరువురు నేతలు, పార్టీని వీడి దూరం అయ్యారు. ఇప్పుడు తిరిగి ఆ ఇద్దరు నేతలను పార్టిలోకి తీసుకువచ్చి, కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది తెలుగు దేశం.
రంగంలోకి ఆ రెండు కుటుంబాలు...
గన్నవరం, గుడివాడలో తెలుగు దేశం తిరిగి విజయం సాధించేందుకు అవసరం అయిన అన్ని వనరులను సమీకరిస్తున్నారు. అందులో భాగంగానే నందమూరి, నారా ఫ్యామిలీలను ఈ నియోజకవర్గంలో జరిగే ఎన్టీఆర్ మందిరం ప్రారంభానికి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని, నందమూరి, నారా కుటుంబాల మద్య విభేదాలపై ఇస్టానుసారంగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆరెండు కుటుంబాలు, పార్టీ తరపున ఒకే వేదిక పైకి తీసుకువస్తే, మొత్తం వ్యవహరం టీడీపీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.