వైసీపీకి కంచుకోటగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో అలజడి మెదలవుతోంది. సొంత పార్టీకి చెందిన నేతల నుంచే ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే జిల్లాలోని నాయకులు విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం కొంరు నేతల్ని కలవరపెడుతోంది.


జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యేకు సవాళ్లు..
జగయ్యపేట నియోజకవర్గంలో స్థానిక వైసీపీ శాసనసభ్యుడిగా ఉన్న ఉదయ భానుకు ప్రస్తుతం సొంత పార్టీ నేతల నుంచి సవాల్ ఎదురవుతోంది. స్థానికంగా పట్టు ఉన్న ఉదయభాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు ఉంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లో సైతం స్థానికంగా ఉదయభానుకు ఫాలోయింగ్ ఉంది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో వైసీపీని బలోపేతం చేయటంతోపాటుగా, పార్టీ నిర్మించిన నాటి నుంచి ఆయన జెండా మోసారు. దీంతో జగన్ వద్ద సామినేని ఉదయభానుకు మంచి వెయిటేజీ ఉంది. పొలిటికల్ గా నియోజకవర్గంలో సామినేనికి మంచిపట్టు ఉండటంతో పాటుగా ప్రస్తుతం అధికారంలో ఉండటంతో ఆయన జోరు కొనసాగుతోంది.


ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన సొంత పార్టీ నేతలు...
నియోజవకర్గంలో సామినేని ఉదయభానుకు పార్టీ పరంగా ఎటువంటి గ్రూపులు లేవు. అదే సమయంలో ఉదయభానుకు పోటీగా మరో నేత పార్టీలో లేకపోవటంతో ఆయనే పెద్ద దిక్కుగా ఉంటున్నారు. అయితే జిల్లా స్థాయిలో సొంత పార్టీకి చెందిన నేతలే సామినేని ఉదయభానును టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఇటీవల జరిగిన పరిణామాలు ఓ కారణంగా కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది.


మంత్రి పదవి విషయంలో... 
మంత్రి పదవి విషయంలో సామినేని ఉదయభాను తీవ్ర నిరాశకు గరయ్యారు. తనకు మంత్రి పదవి రాకపోవటంతో సామినేని చాలా రోజుల వరకు ఇంటి నుంచి బయటకు రాలేదు. చివరకు సీఎం జగన్ జోక్యం చేసుకొని స్వయంగా మాట్లాడి ఉదయభానుకు నచ్చచెప్పారు. అయితే ఇదే సమయంలో తనకు మంత్రి పదవి రాకపోవటం వెనుక జిల్లాకు చెందిన నాయకుల ప్రమేయం ఉందని, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తో పాటుగా మరికొందరు నేతలపై సామినేని ఉదయభాను విమర్శలు చేశారు. ఈ వ్యవహరం పార్టిలో అలజడి రేపింది. ఇక తాజగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భువకుమార్ జన్మదిన వేడుకల్లో ఉదయ భానుతో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావు వాగ్వివాదానికి దిగారు. ఈ సంఘటన సైతం సొంత పార్టీలో అలజడి రేపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, తన సొంత పార్టికి చెందిన శాసన సభ్యుడితో బాహాటంగా కార్యకర్తలు అందరూ చూస్తుండగానే విమర్శలు చేయటం, వాగ్వివాదానికి దిగటం కలకలం రేపింది. దీంతో మరోసారి సామినేని ఉదయభానుకు సొంత పార్టీ నేతలతో ఉన్నవిభేదాలు బహిర్గం అయ్యాయి.


టీడీపీలో విభేదాలు.. వైసీపీకి ప్లస్ పాయింట్.. !  
ఇక జగ్గయ్యపేట టీడీపీలో సీటు కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఇంఛార్జ్ గా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యను అధిష్టానం ప్రకటించింది. అయితే నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల కన్నా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో తమకు సీటు ఇవ్వాలని ఆ వర్గం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి నెట్టం రఘురామ్, పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీకి పూర్తి అవకాశాలు ఉన్నా, పార్టీ జిల్లా నేతలతో ఉదయ భానుకు ఉన్న విభేదాలతో రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.