Floods News in Vijayawada: ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఇంకా తగ్గనందున రేపు (సెప్టెంబర్ 4) కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరదల కారణంగా చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాల్సి వచ్చింది. ఇంకా వరద బాధితులు చాలా మంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నందున స్కూళ్లు నడపడం సాధ్యం కాదు. అందుకని వరుసగా బుధవారం కూడా సెలవు ప్రకటించనున్నారు.
ఈ మేరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లతో పాటు, ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఒకవేళ ఈ ఆదేశాలను పాటించనట్లయితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా వరద ప్రాంతాల్లోనే చంద్రబాబు
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితుల సమస్యలు వింటూ, అందుతున్న సహాయక చర్యల వివరాలు తెలుసుకుంటూ, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీపై వెళ్లి, స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. వరదల్లో సర్వం కోల్పోయి బాధపడుతున్న వారికి మేమున్నామంటూ చంద్రబాబు భరోసా అందిస్తున్నారు. కాలనీల శివారు ఇళ్లకు వెళ్లి, ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా బాధితుల్ని అడిగి సీఎం తెలుసుకున్నారు.
8 లక్షల భోజన ప్యాకెట్లు
‘‘రెండు రోజులుగా వరదలు విజయవాడ నగరాన్ని ముంచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చాలా ప్రాంతాలు వరద ప్రభావం నుంచి బయట పడుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ రిలీఫ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 178 సచివాలయాల ప్రాంతాలు మునిగిపోయాయి. 170 సచివాలయం ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కవర్ చేశాం. బ్రేక్ ఫాస్ట్ ఆరున్నర లక్షలు పాకెట్లు ఇస్తే మధ్యహ్నం భోజనం 8 లక్షలు పాకెట్లు ఇచ్చాం. అన్ని జిల్లాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాం. ప్రతి ఇంటి తలుపు తట్టి ఇప్పుడు సాయం చేస్తున్నాం. ఈ రెండు మూడు రోజులు వారి కోసం మేం పని చేస్తున్నాం. సేఫ్టీ అస్పెక్ట్ చూసుకొని పవర్ రీస్టోర్ చేస్తున్నాం’’
‘‘ఫీల్డులో 30 డ్రోన్లు పని చేస్తున్నాయి. రాత్రికి 10 లక్షలు పాకెట్లు ఆహారం అందిస్తాం. వాటర్ సప్లై కూడా పంపించాం.. ఎక్కువ మంది మిల్క్ అడుగుతున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం ఆదేశం మేరకు 10 లక్షల పాకెట్ల పాలు ఇస్తున్నాం. వరద నీరు తగ్గాక శానిటేషన్ పైన దృష్టి పెడుతున్నాం. నీరు వెళ్ళాక బురదను ఫైర్ డిపార్ట్మెంట్ వాహనాలతో తొలగిస్తాం’’ అని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.