Ration Card Update in AP: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. అర్హులైన అందరికీ రేషన్ అందాలన్న లక్ష్యంలో కొత్తకార్డులు ఇచ్చేందుకు, ఉన్న వాటిలో మార్పులుచేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే ఐదో తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయంలో ఇప్పటికే పలు మార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో విషయంపై క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులు కోసం చేపట్టే దరఖాస్తు ప్రక్రియ నిరంతర ప్రక్రియని ప్రకటించింది. ఎవరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని దీనికి నిర్ణీత గడువు అంటూ లేదని ప్రకటించింది. అందుకే ఇప్పుడే చేసేయాలన్న కంగారు వద్దని ప్రజలకు వివరించింది. 

ప్రభుత్వం జారీ చేసే రేషన్ కార్డుకు చాలా డిమాండ్ ఉంటోంది. ఇది కేవలం సబ్సిడీపై రేషన్ ఇస్తుందనే కాకుండా ఇతర సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుందని జనం ఈ కార్డు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ప్రకటన చేయడంతోనే దరఖాస్తు చేసుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. ఆధార్ కార్డుల అప్‌డేషన్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో మీసేవ కేంద్రాలు, ప్రభుత్వం కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. దీనికి గడువు ఉందనే ప్రచారం కూడా వారిని మరింత కంగారు పెట్టిస్తోంది. 

రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు అనేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకు 4,24,59,128 మందికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. డిలీషన్ అనేది కేవలం డెత్ కేసులకు, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండే వారికి మాత్రమే డిలీషన్‌ పరిమితం అవుతుందని తెలిపింది.  

మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదుమ‌్యారేజ్ సర్టిఫికెట్ విషయంలో నెలకొన్న గందరగోళానికి ఈ మధ్యే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలనుకునే జంటలకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని అని అన్నారు. అదే టైంలో పెళ్లి ఫొటోలు, పెళ్లికార్డులు, వంటివి కూడా అవసరం లేదని చెప్పేశారు. ఫీల్డ్‌లో ఉన్న సిబ్బంది జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని మంత్రి సూచించారు. ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా నేరుగా వెరిఫై చేసి మాత్రమే వివరాలు రిజిస్టర్ చేయాలని అన్నారు. గతంలో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మొదట్లో కొత్తగా పెళ్లి అయిన జంటలు మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇబ్బంది పడ్డారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ అవసరం లేదని ప్రకటించింది. 

ఎలా అప్లై చేయాలికొత్త రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో https://onlineap.meeseva.gov.in/CitizenPortal/UserInterface/Citizen/Home.aspx వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అది మీ వద్ద ఉంచుకొని కార్డు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి గ్రామ లేదా వార్డు సచివాలయంలో రేషన్ కార్డు దరఖాస్తు తీసుకోవాలి. వాటిని పూర్తి చేసి సరైన డాక్యుమెంట్స్‌ అటాచ్ చేసి వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు. 

వాట్సాప్ ద్వారా దరఖాస్తు ప్రభుత్వం ఈసారి వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. మన మిత్ర వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మూడు దశల్లో వెరిఫికేషన్ 

దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మూడు దశల్లో అధికారులు వెరిఫై చేస్తారు. ఈకేవైసీ, గ్రామ రెవెన్యూ ఆఫీసర్‌ వెరిఫికేషన్, తహసీల్దార్ రివ్యూ ఉంటుంది. అనంతరం 21 రోజుల తర్వాత మీకు రేషన్ కార్డు మీకు వస్తుంది. 

ముఖ్యమైన సూచనలు ఏంటంటే...

  • రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేదు. ఎప్పుడైనా అర్హులు అప్లై చేసుకోవచ్చు
  • కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులు పూర్తిగా ఉచితంగా అందజేయనున్నారు. దీని కోసం ఎవరికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని లేదు. 
  • ఈసారి రేషన్ కార్డులను డిజిటల్ రూపంలోనే ఇస్తున్నారు. వాటిని ప్రింట్‌అవుట్ తీసుకొని వాడుకోవచ్చు. 
  • ఇప్పటి నుంచి ఒంటరి మహిళలకు, విడాకులు తీసుకున్న వారికి వేరుగా రేషన్ కార్డులు ఇస్తున్నారు. 
  • పేర్లు మార్పులు చేర్పుల కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. చనిపోయిన వారి పేర్లు తొలగించేందుకు మాత్రమే డాక్యుమెంట్స్ అడుగుతారు. 

ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఐదు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందలో యాభై వేలుకుపైగా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినవే.