AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Andhra Pradesh News | వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. వాట్సాప్ లో ఒక్క క్లిక్‌తో 161 సేవలు ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Nara Lokesh About WhatsApp Governance | దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఈ సేవల్ని ప్రారంభించింది. మంత్రి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవల్ని ప్రారంభించారు. మీరు వాట్సాప్ నెంబర్‌కు ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీకు సర్టిఫికెట్స్ సైతం ఆన్ లైన్‌లోనే అందిస్తుంది ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ మొదటి విడతలో రెవెన్యూ, దేవాదాయ, ఏపీఎస్ ఆర్టీసీ, ఎనర్జీ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో 161 సేవలను అందుబాటులోకి తెచ్చింది. రెండో దశలో 360 సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఈ నెంబర్ సేవ్ చేసుకోండి..
9552300009 నెంబర్ ని సేవ్ చేసుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ వాట్సాప్ నెంబర్ కు మెస్సేజ్ చేయడం ద్వారా మీరు సేవల్ని పొందవచ్చు. అందులో మీకు ఏ సేవలు కావాలో ఎంచుకునే అవకావాన్ని పౌరులకు కల్పించింది. కూటమి ప్రభుత్వం పారదర్శకతతో పాటు వేగంగా పౌరులకు సేవలు కల్పించడానికి టెక్నాలజీని వినియోగించింది. నారా లోకేష్ చొరవ తీసుకుని మెటా సంస్థతో గత ఏడాది అక్టోబర్ నెలలో చర్చలు జరిపి, ప్రాసెస్ మొదలుపెట్టారు. నేడు అంతా పూర్తయి, మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని మంత్రి లోకేష్ గురువారం నాడు ప్రారంభించారు.
ఏయే సేవలు పొందవచ్చు, ఆ వివరాలిలా
అధికారిక వాట్సప్ నంబర్ 9552300009 ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది. దేవాదాయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు సంబంధిత సేవలు, ఏపీఎస్ ఆర్టీసీ సేవలు, సీఎంఆర్ఎఫ్ సేవలు, సీడీఎంఏ సేవలు, ఎనర్జీ సేవలు, వ్యవసాయ, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్తు, పర్యాటక తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ వాట్సాప్ నెంబర్ కు మెస్సేజ్ చేస్తే లింక్ వస్తుంది. దాని ద్వారా మీరు ఫిర్యాదులు కూడా ఇవ్వొచ్చు. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీ ఫిర్యాదు గురించి లేటెస్ట్ అప్డేట్ సైతం తెలుసుకునే వీలుంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పథకాల ద్వారా కలిగే లబ్ధి లాంటి అంశాలు సైతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటివరకూ సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి మీరు దీని ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వం అందించే మరిన్ని ధ్రువపత్రాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు. రెవెన్యూశాఖ రికార్డులు, ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చు. ఆస్తి పన్ను, విద్యు్త్ బిల్లులు లాంటివి చెల్లించే అవకాశం కల్పించారు. మీకు అందుతున్న సేవలపై ఫీడ్ బ్యాక్ సైతం ఇచ్చే వీలుంటుంది.
యువగళం పాదయాత్రలో ఐడియా వచ్చిందన్న నారా లోకేష్
మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం అనే విధానంతో పౌరులకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందుతాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. ఏదైనా సేవలు కావాలంటే పౌరులు ప్రభుత్వ ఆఫీసులకు ఎందుకు రావాలి, వారి పని తేలిక చేయాలని కూటమి ప్రభుత్వం భావించినట్లు చెప్పారు. యువగళం పాదయాత్రలో ప్రజలు సమస్యలు చూశాక తనకు ఈ ఐడియా వచ్చిందన్నారు. ఒక్క క్లిక్‌తో ఫుడ్ వస్తుంది, డ్రెస్సులు, ఐటమ్స్ వస్తున్నాయి. మరి ప్రభుత్వ సేవలు మాత్రం ఒక్క క్లిక్‌తో ఎందుకు సాధ్యం కాదని ఛాలెంజింగ్‌గా తీసుకుని వాట్సాప్ గవర్నెన్స్ ను అమలులోకి తెచ్చామన్నారు. సర్టిఫికెట్స్ రాకుండా గత ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు చూసి మార్పునకు శ్రీకారం చుట్టామని నారా లోకేష్ పేర్కొన్నారు.