Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు శుక్రవారం లోకేష్ హాజరయ్యారు. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సింగలూరు శాంతి ప్రసాద్‌ నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారన్నారు. ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైసీపీదేనన్నారు. 


‘నాకు క్లాస్ మేట్స్ ఉంటే.. జగన్‌కు జైల్ మేట్స్ ఉన్నారు’
తాను ఓ నియంతపై తాను పోరాడుతున్నానని, ఓ పెత్తందారు, వైసీపీ గోబల్‌ ప్రచారంపై పోరాటం చేస్తున్నట్లు లోకేష్ అన్నారు. న్యాయం కోసమే కోర్టును ఆశ్రయించినట్లు ఆయన చెప్పారు. తనది కాలేజీ లైఫ్‌ అని, జగన్‌ది జైలు లైఫ్‌ అని విమర్శించారు. తనకు క్లాస్‌మేట్స్‌ ఉంటే, జగన్‌కు జైల్‌మేట్స్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, విదేశాలకు వెళ్లాలంటే తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, కానీ జగన్‌ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలని వ్యాఖ్యానించారు. 


‘మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తా’
తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్‌ లక్షల కోట్లు దోపిడీ చేశారని, తన తాత, తండ్రి సీఎంగా ఉన్నా తాను ఏనాడూ అక్రమ సంపాదనకు పాల్పడలేదని లోకేష్ అన్నారు. కంతేరులో తాను 14 ఎకరాలు కొన్నానని పోసాని ఆరోపణలు చేశారని, తన పేరు మీద భూమి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పోసాని అసత్య ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సారి మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావట్లేదని, ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు.


సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు. కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేసారని పోసాని ఆరోపించారు. అలాగే సింగలూరు ప్రసాద్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తనకు కంతేరులో గుంట భూమి కూడా లేదన్నారు. తనపై తప్పడు ప్రచారం చేసే వారి సంగతి ఏంటో చూస్తానన్నారు.


తనపై నిరాదార ఆరోపణలు చేసినందుకు క్రమాపణలు చెప్పాలని లాయర్ ద్వారా పోసానికి లోకేష్ నోటీసులు పంపించారు. ఇలా రెండుసార్లు లాయర్ నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని లోకేశ్‌ తెలిపారు. 


రేపటి నుంచి పాదయాత్ర కొనసాగింపు
పరువు నష్టం కేసులో నారా లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో నేత నారా లోకేష్ శుక్రవారం యువగళం పాదయాత్రక విరామం ఇచ్చారు. 188వరోజు పాదయాత్ర ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి 19వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial