Nandamuri Tarakaramarao Birth Anniversary: తెలుగు వారికి నిజమైన ఆత్మగౌరవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ కొనియాడారు. నటధీశాలి అయిన ఎన్టీ రామారావు తెలుగు వారికి అసలు సిసలైన హీరో అని అన్నారు. తెలుగు ప్రజలకు నిజమైన రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు. విజయవాడలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్ పాలనలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, ఓ సంక్రాంతి, ఉగాది, దీపావళి పండగల్లా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. 


ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు


ఎన్టీ రామారావు పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకువచ్చారని బాలకృష్ణ కొనియాడారు. 'జనహితమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే నా దేవాలయం అన్నట్లుగానే పార్టీని నడిపించారు, పాలన సాగించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకు వచ్చారు. రూ. 2 లకే కిలో బియ్యం పథకం తీసుకువచ్చి పేదల కడుపు నింపారు. పక్కా ఇల్లు నిర్మించారు. భూమి శిస్తు రద్దు చేశారు. పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు. మాండలిక వ్యవస్థను ప్రవేశ పెట్టారు. తాలూకాలను మండలాలు మార్చి ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చారు. సమగ్రాభివృద్థికి సరైన వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 20 శాతం మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మహిళల కోసం పద్మావతి లాంటి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు ప్రారంభించారు. శ్రీరాంసాగర్, దేవాదుల, బీమా పథకాలు ప్రారంభించారు. 11 వేల కోట్ల రైతు రుణాల మాఫీ చేశారు' అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. 


బాలకృష్ణ, రజినీ కాంత్ ఆత్మీయ ఆలింగనం


అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడకు వచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ కు గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్ స్టార్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటూ రజినీకాంత్, బాలకృష్ణ పరస్పరం పలకరించుకున్నారు. ఆపై ఒకే కారులో ఇద్దరూ కలిసి నోవోటెల్ కు బయలు దేరి వెళ్లారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజినీ కాంత్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అంటూ రజినీ కాంత్ వ్యాఖ్యానించారు. నోవోటెల్ హోటల్ కు వెళ్లిన వెంటనే రజినీ కాంత్ తో బాలయ్య కాసేపు సమావేశం అయ్యారు.


చంద్రబాబు, రజినీల సమావేశం..


అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సూపర్ స్టార్ రజినీ కాంత్ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బాలకృష్ణ రజినీ కాంత్ ను చంద్రబాబు నివాసానికి స్వయంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రజినీకాంత్ ఇద్దరూ పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణతో కలిసి తాజా పరిస్థితులపై మాట్లాడుకున్నారు.