Vijayasai Reddy: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి చేసినట్లు చంద్రయాన్ సక్సెస్ పై చంద్రబాబు, ఎల్లో మీడియా హడావిడి చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విమర్శించారు. గురువారం ఆయన పల్నాడు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు జరుగుతున్నాయని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని విజయసాయిరెడ్డి అన్నారు.
టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తోందని, చంద్రయాన్ స్పీడ్‌తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తోందన్నారు. అక్కడ చంద్రయాన్ సక్సెస్ ఇక్కడ చంద్రబాబు సక్సెస్ అన్న టీడీపీ ప్రచారంపై స్పందిస్తూ చంద్రయాన్‌కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాజకీయంగా ఫ్రస్టేషన్ లో ఉన్న చంద్రబాబు ఏం చేయాలో తెలియక ఇలాంటి భజనలు చేయించుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ డీబీటీనే నమ్ముకుందని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోందన్నారు.
చంద్రబాబుకు తానొక సలహా ఇస్తానని, టీడీపీ పేరును జీపీటీ(గెలిస్తే తంతా) పార్టీగా మర్చిచితే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గెలిస్తే అందరిని తంతామని, కొడతామని, బట్టలిప్పుతామని, నడిరోడ్డు మీద కట్ డ్రాయర్‌తో నడిపిస్తామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెబుతున్నారని, అసలు వారు గెలిచే అవకాశమే లేదన్నారు. వారికి సంస్కారం లేదని, అసభ్యకరమైన పదజాలం ఎక్కడ నేర్చుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు ఏం చేశారని నిలదీశారు.
దేశవ్యాప్తంగా జాతీయ చానళ్లు చేసిన సర్వేల్లో 2024లో 24, 25 లోక్‌సభ స్థానాలు వైసీపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ లెక్కలో 175 అసెంబ్లీ స్థానాలకు 175 వైసీపీకి వస్తాయన్నారు. ఒకవేళ అన్ని రాకపోయినా గతంలో వచ్చిన 151కి పైనే వస్తాయని అందులో ఎటువంటి సందదేహం లేదన్నారు. కాషాయంలో ఉన్న కొందరు ఎల్లో బ్యాచ్‌కి టీడీపీ రెడ్‌లో ఉండటంతో నిద్ర పట్టడం లేదని విమర్శించారు. లోకేష్, చంద్రబాబు గెలిస్తే ‘తంతాం, బట్టలూడదీస్తాం’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే అన్నారు.
టీడీపీకి క్రెడిబిలిటీ లేదని, విజన్ 2047 చంద్రబాబుది కాదని నీతి ఆయోగ్ రిపోర్ట్‌ను కాపీ కొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ గెలిచిందని, లోకేష్, చంద్రబాబు సులభ్ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఏపీ అభివృద్ధి నిరోధకులని విమర్శించారు.
టీడీపీ అధికారంలో రావటం కల అని, అయ్యన్న పాత్రుడు సీఎం జగన్‌ను, ఆయన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు కాదని, అర గుండు పాత్రుడని వ్యాఖ్యానించారు. చిలుకలూరి పేట సమావేశం జరిగినప్పుడు ముగ్గురిమే ఉన్నామని, మేము ఏం మాట్లాడుకున్నామన్నది ఏదో ఊహించుకొని రాయటం తప్పు అన్నారు. పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.