MLA Vallabhaneni: టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. చంద్రబాబుకు అధికారం దక్కలేదని, తన కుల పత్రికలు బాధలో ఉన్నాయని విమర్శించారు. ఆవేశంతో కావాలనే గోబెల్ ప్రచారం చేస్తున్నాయంటూ వంశీ దుయ్యబట్టారు. చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ లేదు బొక్కా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఓ మహిళా ఆఫీసర్ తోనే అసభ్యంగా ప్రవర్తించిన అతను చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని చెప్పారు వంశీ. అచ్చెన్నాయుడు తన గురించి మాట్లాడితే.. అతని చిట్టా విప్పుతానంటూ వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. చంద్రబాబు డబ్బు కోసం పదవుల అమ్ముకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం జగన్ అని అందుకే బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా కామెంట్లు..
టీడీపీ లీడర్లు ప్రస్ట్రేషన్‌లో ఉన్నారని ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ వస్తారో అన్న భయం వారిలో ఉందన్నారు వంశీ. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారని.. కానీ చంద్రబాబుకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని వంశీ చెబుతున్నారు. అయితే ఇవన్నీ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం కాదు.. కానీ ఉద్దేశపూర్కంగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనను మీడియా ఇంటర్యూల్లో తీసుకు వస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు భుజం కాస్తామని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియా ఇంటర్యూల్లో ప్రకటించడం సంచలనంగా మారుతోంది. వైఎస్ఆర్‌సీపీలో ఉండి.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు భజం కాస్తామని చెప్పడం అంటే.. ప్రస్తుతం ఉన్న పార్టీపై పెద్దగా ఆసక్తిగా లేరని పరోక్షంగా చెప్పడమేనని అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వల్లభనేని వంశీ పదే పదే ఎందుకు తెస్తున్నారన్న సందేహాలు కూడా వస్తున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మాతలుగా సినిమాలు తీశారు.కానీ ఇప్పుడు ఆ సంబంధాలు ఉన్నాయా లేవా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ మధ్య కాలంలో పరస్పరం ఎదురుపడినట్లుగా కూడా వార్తలు రాలేదు. దీంతో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతోనే టీడీపీలో టిక్కెట్లు ఇప్పించుకుని ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముందుగా కొడాలి నాని పార్టీ మారారు. చాలా కాలం పాటు టీడీపీకి విధేయంగానే ఉండి.. గత ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన తర్వాత వంశీ పార్టీ మారారు. అప్పట్నుంచి టీడీపీపై.. చంద్రబాబుపై ఆయన కుటుంబంపై దారుణ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఆఫీసుపైనా దాడి చేయించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు గన్నవరం టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పట్టాభీ... ఇదంతా చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. వంశీపై పోటీ చేసేందుకు తనకు ఎవరూ పోటీ ఉండకూదన్న ఉద్దేశంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ ఆఫీస్‌పై దాడి డ్రామా ఆడారని అంటున్నారు.