ఏదైనా కేసులో ఇరుక్కుంటే చంద్రబాబు దాన్ని ఎలా డైవర్ట్ చేస్తారో గతంలో చూశామని మంత్రి రోజా అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కూడా దర్జాగా ఉంటూనే ‘మా వాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ మాట్లాడారని గుర్తు చేశారు. తనపై కక్ష్య సాధిస్తున్నారని మాట్లాడుతూ సింపతీ డ్రామా చేస్తుంటారని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందున అదే సూత్రంతో ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఎవరైతే డబ్బు ఇచ్చారో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయనకు పీఏ అని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.


దాదాపు 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇప్పుడు కొంతే బయటపడిందని మంత్రి రోజా ఆరోపించారు. ఇప్పటిదాకా పచ్చ పత్రికల సాయంతో వివిధ కేసుల విషయంలో తన తప్పేమీ లేదని నిరూపించుకోగలిగారని, ఇకపై అది కుదరదని రోజా అన్నారు. సొంత మనుషులే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా చంద్రబాబు అరెస్టు ఖాయం అయిపోయిందని రోజా ఆరోపించారు. 


చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందని అన్నారు. రూ.118 కోట్ల ముడుపుల కేసులో చంద్రబాబు విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా? అని ప్రశ్నించారు. విచారణ నుంచి తప్పించుకొనేందుకు గతంలో బాలకృష్ణ తరహాలో మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటారా అని రోజా ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి విజయ్‌ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. 


చంద్రబాబు, లోకేష్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ఆ పరిణామం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బాబు అడ్డంగా దొరికిపోయిన సందర్భంలో సానుభూతి డ్రామాలు ఆడటం ఆయనకు అలవాటు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదని.. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని అన్నారు. 2019లో ఎన్నికల ముందు కూడా మోదీ తనను అరెస్ట్‌ చేస్తారని చంద్రబాబు సింపతి డ్రామా ఆడారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్‌ చేయాలని.. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాలని మంత్రి రోజా డిమాండ్‌ చేశారు.


పెనమలూరు సమావేశానికి రోజా హాజరు


కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పెనమలూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. హాజరై స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారధి ద్వారా నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలు రివ్యూ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షించి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులకు తెలియపరచి వాటికి తగు పరిష్కారాల కోసం చర్చించారు. తగిన సలహాలు సూచనలు చేసి ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని తద్వారా జగనన్నకు, జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు, జిల్లా అధ్యక్షులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని, పామర్రు శాసనసభ్యులు అనిల్, డీసీసీ బ్యాంకు జిల్లా ఛైర్ పర్సన్ పద్మావతి, స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.