Minister RK Roja: పెద్ద దొంగను కాపాడేందుకు చిన్న దొంగ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవడాన్ని రోజా ఎద్దేవా చేశారు. ఏరోజైనా రాష్ట్రం కోసం గానీ ప్రజల ప్రయోజనాల కోసం గానీ రాష్ట్రపతిని కలిశారా అని ప్రశ్నించారు. నారా లోకేశ్, వాళ్ల అమ్మతో పాటు టీడీపీ నేతల ప్రవర్తన.. తాము చట్టానికి అతీతులం అన్నట్టుగా ఉందని రోజా అన్నారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను అడ్డంగా దోచేస్తే.. వాళ్ల మీద ఏ కేసులూ పెట్టకూడదని అంటున్నారని.. అరెస్టులు చేయకూడదని చెబుతున్నారని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఒక పక్క రాష్ట్ర ఖజనాకు కన్నమేసి వందల కోట్లు కొట్టేసిన దొంగగా ఆధారాలతో సహా దొరికి జైలుకెళ్లిన చంద్రబాబు గురించి న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బయట వీళ్లు మాత్రం మేమంతా సచ్ఛీలురుమంటూ బిల్డప్‌లిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
'ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకోవడానికి నారా లోకేశ్ పడరాని పాట్లు పడుతున్నాడు. వాళ్లేమో ఇతని తీరుకు ముందుగానే భయపడి తమ కాళ్లను దాచుకుంటున్నారు. ఎందుకంటే, ఆంధ్ర ప్రజలు నమ్మకంగా చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెడితే.. వారి నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజా సొమ్మును అడ్డంగా దోచేసిన దొంగగా మిగిలాడు. అలాంటి దోపిడీ దొంగకు మద్ధతిచ్చే ఉద్దేశం లేకనే మోదీ, అమిత్ షా లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదనేది స్పష్టమౌతున్న సంగతి' అని మంత్రి ఆర్కే రోజా అన్నారు.
'4 స్కామ్‌ల్లో నేరస్తుడు చంద్రబాబు'
చంద్రబాబు హయాంలో జరిగిన దొంగతనాలు, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన చేసిన కుంభకోణాలు ఒకటీ అరా కాదు. తీగలాగేకొద్దీ అతని అవినీతి డొంక కదులుతూనే ఉంది. ఇప్పటికి నాలుగు కుంభకోణాల్లో ఆయన నేరస్తుడు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌భూముల స్కామ్, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కామ్.. వీటన్నింటికీ చంద్రబాబు ఏ విధంగా సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించి రూ.కోట్లు కొట్టేశాడనేది ఆధారాలతో సహా ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో తేలిన విషయం.
'క్విడ్ ప్రోకో నేరగాళ్లు బాబు, లోకేశ్'
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ నేరస్తుడు జైల్లో ఉంటే.. ఇన్నర్‌రింగ్ రోడ్ స్కామ్‌లో నిందితుడైన లోకేశ్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవడమనేది హాస్యాస్పదం. మరి, లోకేశ్ ఇన్నర్‌రింగ్ రోడ్ స్కామ్‌పై చాలా అమాయకంగా నటిస్తూ మాట్లాడుతున్నాడు. అసలు ఇన్నర్‌రింగ్ రోడ్డే లేదు కదా.. స్కామ్ ఎలా జరుగుతుందని ఆయన దీర్ఘాలు తీస్తున్నాడు. కానీ, ఆయన తండ్రి మాయాజాలం అతనికి అర్ధమైందో లేదో గానీ.. ప్రజలకు మాత్రం ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ పట్ల స్పష్టత వచ్చింది. అమరావతి రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్ లేకుండానే.. చంద్రబాబు పెద్ద ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించినట్లు గ్రాఫిక్స్‌ల్లో కళ్లకు కట్టినట్టు చూపించి లింగమనేని తదితరులు దగ్గర రూ.కోట్లు విలువైన భూమిని కొట్టేసి క్విడ్‌ప్రోకోకు ఎలా పాల్పడ్డాడో అందరికీ తెలుసు. లేని రోడ్లకే గ్రాఫిక్కులు చూపించి స్కామ్ చేసినోడు.. ఇక, ఉన్న రోడ్లను చూపెట్టి ఎంత దండుకుంటాడో అనేదీ అందరూ ఆలోచన చేయాలి. ఈ విధంగా తండ్రీకొడుకులు కలిసి క్విడ్‌ప్రోకోకు పాల్పడి ఈ రాష్ట్ర సంపదను అడ్డంగా దోచుకుని ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో అందరికీ అవగాహన కావాల్సిన సమయమిదిగా చెబుతున్నాను.
'ఏపీకి రిటర్న్ రావడానికే భయపడ్డ లోకేశ్'
నిన్న లోకేశ్ మేకపోతు గాంభీర్యం నటిస్తూ.. వచ్చే ఆర్నెల్లలో మా నాయకుడు జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడాన్ని విని అందరూ నవ్వుకుంటున్నారు. అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికి దొంగల్లా పారిపోయి ఢిల్లీలో దాక్కున వ్యక్తి రిటర్న్ గిఫ్టుల గురించి మాట్లాడటమా..? ఏపీకి రిటర్న్ రావడానికే భయపడుతున్న వ్యక్తి లోకేశ్ అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట. భయాన్ని పరిచయం చేస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఈరోజు కాళ్ల దగ్గర్నుంచీ కళ్ల వరకు భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడు. ఎక్కడ ఎవరు తనను చూస్తారో.. ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనని గజగజ వణుకుతూ ఢిల్లీ రోడ్లమీద దొంగలా తిరుగుతున్న లోకేశ్‌ను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
'భువనేశ్వరి నోటనే బాబు అవినీతి'
లోకేశ్ తీరు ఒకలా ఉంటే, ఆయన తల్లి భువనేశ్వరి తీరు మరింత విచిత్రంగా ఉంది. మేము ప్రజల డబ్బును దోచుకోవాల్సిన అవసరమేదీ లేదు. మా హెరిటేజ్ కంపెనీలో 2 శాతం షేర్‌ను అమ్మితేనే రూ.400 కోట్లు వస్తుందన్న ఆమె, తన భర్త చంద్రబాబు ఎంత అవినీతిపరుడో చెప్పకనే చెప్పింది. ఈ విషయాన్ని ప్రజలు, అటు ప్రభుత్వ అధికారులు గమనించాలి. కేవలం 2 శాతం షేర్ అమ్మితేనే రూ.400 కోట్లు వస్తే.. హెరిటేజ్ మొత్తం అమ్మితే దాదాపు రూ.20 వేల కోట్లు వస్తాయి. మరి, చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.20వేల కోట్లును చూపించాడా.. లేదా..? అనే సంగతి తేల్చాల్సి ఉంది.
ఇలా అన్ని ఆస్తులు కలిపి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 14 ఏళ్ల అధికారంలో ప్రజల్ని అడ్డంగా దోచుకున్న సొమ్మేకదా ఆ రూ.2 లక్షల కోట్లు..? పాలు పిండుకుంటే.. కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకుని వాటిని అమ్ముకుంటేనే ఇన్ని రూ.లక్షల కోట్లు వచ్చాయా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను' అని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.