తొడకొట్టిన బాలయ్య తోకముడిచి పారిపోయాడని ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే టీడీపీ చర్చ కోసం వచ్చిందా అని అడిగారు. ఈ విషయం ప్రజలకు అర్ధమై ఉంటుందని అన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి చేశారని.. నిన్న తొడకొట్టిన బాలకృష్ణ ఈ రోజు స్కిల్ స్కాంపై చర్చించకుండా తోకముడిచి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. రోషం లేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా? అని మాట్లాడారు.
చంద్రబాబు క్షమాపణ కోరాలి
‘‘అబద్దాన్ని పదిసార్లు చెప్తే జనం నిజమని నమ్ముతారని టీడీపీ భ్రమల్లో బతుకుతోంది. దానిలో భాగంగానే చంద్రబాబు దేవుడంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఆయన వారికి జాతి పిత కాబట్టి- ఆ జాతివారికి బాధ ఉంటుందేమో కానీ, ప్రజలకు మాత్రం ఎవరికీ బాధ లేదు. ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చంద్రబాబు దోచుకున్నాడు. పేద పిల్లలకు సంబంధించిన స్కిల్ డెవలెప్‌మెంట్‌ను తన దోపిడీకి ఉపయోగించుకున్నాడని యువత ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం కష్టాల్లో, నష్టాల్లో ఉందని అబద్దాలు చెప్పి తాను మాత్రం దోచుకుని పక్క రాష్ట్రంలో ప్యాలెస్ కట్టుకున్నారు. అలా దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందిస్తాను నన్ను క్షమించండి అని ప్రజల కాళ్లావేళ్లా పడి చంద్రబాబు క్షమాపణలు కోరాలి.
చర్చకు పట్టుబట్టి, ఎందుకు పారిపోయారు?
నిన్ననే స్కిల్‌పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చి.. ఈ రోజు చర్చ జరుగుతుంటే ఎందుకు పారిపోయారు? హంగామా చేసి సస్పెండ్ అయ్యి బయటకు వెళ్లి తమ గొంతు నొక్కాశారు అని చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ పెట్టగానే బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. నేను టీడీపీ వారిని సూటిగా అడుగుతున్నాను. మీకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదా? లేక ఆ స్కాంలో మీకు కూడా వాటాలున్నాయా? బాలకృష్ణ సినిమాల్లోనే డైలాగులు చెప్తాడా.. అసెంబ్లీలో చెప్పడం రాదా? స్కాం నిజమా కాదా అని చెప్పే అవకాశం వచ్చినప్పుడు బాలకృష్ణ చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థం ఏమిటి? ప్రభుత్వం వద్ద ఆధారాలే లేవు.. స్కాం జరగలేదు అన్న పెద్ద మనుషులు ఈ రోజు ఎందుకు పారిపోయారు. ఈ రోజు మేం సభలో సాక్షాధారాలతో సహా స్కాం జరిగిన తీరు వివరించాం.
సీమెన్స్ సంస్థ పది రూపాయలు కూడా పెట్టుబడి పెట్టకుండా, ఆ పేరుతో ఎందుకు రూ.371 కోట్లు విడుదల చేశారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అన్ని సాక్షాధారాలు దొరికాయి కాబట్టే చంద్రబాబును జైలుకు పంపారు.
బాబు దోపిడీ చూసి ప్రజలు విస్తుపోతున్నారు
‘‘చంద్రబాబు ఇన్నేళ్లు చాలా తెలివిగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ దోచుకున్నాడు. ఇప్పుడు సాక్షాధారాలతో దొరికిపోయాడు...ఇక టీడీపీ పరిస్థితి ఏంటి అనేది తెలియక టీడీపీ ఎమ్మెల్యేలు పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు. సభలో వారి ప్రవర్తన చూసి వారికి ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. టీడీపీ వారు సమస్యలపై చర్చించడం కాదు...వారే మనకు సమస్యై కూర్చున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అనుభవం ఉంది కదా అని ఈ తెలుగు దొంగల పార్టీకి అధికారం ఇస్తే ఎలా దోచుకున్నారో చూసి ప్రజలు విస్తుపోతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను చూసి ప్రజలు ఎవరూ పాపం అని అనడం లేదు. చంద్రబాబు పాపాలు పండిపోయాయి..అని అంటున్నారు.
ఇక బాబు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక మీదట జగన్ గారిని అనవసరంగా ఎవరైనా మాట్లాడితే వదిలిపెట్టేది లేదు’’ అని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.