ఈ మధ్య కాలంలో సంపన్నులే కాదు, మధ్య, దిగువ మధ్యతరగతి వారు కూడా పెళ్లిళ్లు వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నారు. అందుకోసం తమ శక్తి మేర వారు ఖర్చుకు వెనకాడడం లేదు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు పెళ్లి అనేది స్టేటస్ సింబల్ తరహాలో కొంత మంది భావిస్తున్నారు. తమ బంధువుల్లో ఎవరో ఒకరు డాబుగా పెళ్లి చేసుకుంటే, అంతకు తక్కువగా చేస్తే లోకువ అయిపోతామనే భావనతో రూ.లక్షలు, రూ.కోట్లు పోసి వివాహాలు చేసుకునేవారూ ఉన్నారు. ఇక కాస్త ఆస్తిపాస్తులు, డబ్బు నిల్వలు ఉన్నవారి సంగతి అయితే చెప్పక్కర్లేదు. పెళ్లి మండపం నుంచి, భోజనాల వరకూ విలాసంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్నవారు కూడా తమ స్థాయికి తగ్గట్లుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.


కానీ, ఇందుకు పూర్తి భిన్నంగా ఓ జాయింట్ కలెక్టర్ పెళ్లి జరిగింది. ఆమె తన కంటే జూనియర్, ట్రైనీ ఐపీఎస్ అయిన వ్యక్తిని అత్యంత నిరాడంబర రీతిలో పెళ్లి చేసుకున్నారు. కేవలం ఆ ఆఫీసులోని ఉద్యోగుల మధ్య ఇద్దరూ దండలు మార్చుకొని రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. 


రాజస్థాన్ కు చెందిన అపరాజిత సింగ్ సిన్‌సిన్వర్ 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ క్యాడర్ అయిన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. ఈమె రాజస్థాన్ కే చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలోనే జిల్లా రిజిస్ట్రార్‌ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.


ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా, తన ఆఫీసు సిబ్బంది సమక్షంలోనే వీరు పెళ్లి చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ యూపీ కేడర్‌కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని పోలీస్‌ అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నారు. వివాహం చేసుకున్న అనంతరం  నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఇతర ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.


గత ఫిబ్రవరిలో కూడా ఏపీలో యువ ఐఏఎస్‌ల జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ కుమార్‌ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి వేడుక తిరుపతిలో జరిగింది. బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నాగలక్ష్మి 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఐఏఎస్.. నవీన్‌ కుమార్‌ 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. నవీన్‌ కుమార్‌ ప్రస్తుతం జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్నారు.