Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ పేట పోలీసు స్టేషన్ ఎదుట పెడన కాకర్లమూడి సర్పంచ్ కామేశ్వర రావు ఆందోళనకు దిగారు. ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు వచ్చిన తన పట్ల ఎస్సై చాణిక్య అవమానకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్సై చాణిక్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కాకర్లమూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అల్లరి చేస్తున్నాడనే కారణంతో బలరామునిపేటకు చెందిన ఓ యువకుడిని సర్పంచ్ మంగినపూడి బీచ్ వద్ద చెట్టుకు కట్టి కొట్టాడని సీఐ రవి కుమార్ తెలిపారు. ఏదైనా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారని సీఐ చెప్పారు. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టి కొట్టిన కేసులో పెడన కాకర్లమూడి గ్రామ సర్పంచ్ కామేశ్వర రావుపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. నోటీసులు ఇచ్చే విషయంలో సర్పంచ్ తమ ఎస్సైతో వాగ్వివాదానికి దిగి చట్టవ్యతిరేకంగా వ్యవహరించాడని అన్నారు. సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.




"అతనికి గాయాలు ఉన్నాయి. ఇది అప్పుడు మూడు నెలల క్రితం. గతంలో ఓ కేసులో ఎవరో ఇద్దరు ప్రేమించుకుంటే అమ్మాయి ద్వారా అబ్బాయిని పిలిపించి ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. ఆ కేసులో ఇతడు ముద్దాయి. ఇప్పుడు ఇంత ఘోరంగా ఓ అబ్బాయిని కర్రలతో కొడితే అతను ముద్దాయి కాదు.. మా ఊర్లో కొట్టొచ్చు, మాకదే న్యాయం అంటే ఎలా కుదురుతుందండి. చట్ట ప్రకారం ఇది ఒప్పుకునేదా. విచారణ కోసం పిలిపిస్తే.. నేను సర్పంచిని, నేను ఏదైనా చేయొచ్చంటే అది ఎంత వరకు కరెక్టు. చూడండి మీరే చూడండి." - ఆర్ పేట ఎస్సై