Family takes out funeral procession in Vijayawada For Dog: అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోయింది. ఒకటి కాదు రెండు కాదు 12సంవత్సరాల పాటు ఇంటిలో కుటుంబ సభ్యుడుగా కలసిపోయింది. లివర్ డ్యామేజి కారణంగా మూడు రోజులుగా అన్నం తినలేని పరిస్దితుల్లో చివరకు వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ మూగ జీవి తుది శ్వాస విడిచింది. కళ్ళ ముందు ముద్దు ముద్దుగా తిరిగిన కుక్క చనిపోవటంతో జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సొంత స్దలంలోనే అంత్యక్రియలు కూడ చేశారు.
పెంపుడు కుక్క కు హై ఫై లైఫ్....
విజయవాడ నగరంలోని మదురానగర్ లో నివాసం ఉంటున్నారు, బెల్లంకొండ మస్తాన్ వరప్రసాద్ కుటుంబం. ఇంట్లో చెర్రి అనే కుక్క ఉంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఎలా మెలుగుతారో అంతకన్నా ఎక్కువగానే చెర్రి ఇంట్లో కలివిడిగా తిరగేది. అంతే కాదు పెంపుడు కుక్క అయినప్పటికి తన జాతి కుక్కలతో కూడ చెర్రి అంతే సఖ్యతగా మెలిగేది. ఇంటిలో చెర్రికి ప్రత్యేక ట్రీట్ మెంట్ ఉంటుంది. మనుషులతో సామానంగా భోజనం, వైద్యంతో పాటుగా,పడుకునేందుకు ప్రత్యేక బెడ్ సదుపాయం కూడ చెర్రికి ప్రత్యేకం. మెయిన్ బెడ్ రూమ్‌లో చెర్రిదే ఆధిపత్యం, కుటుంబ యజమాని పడుకుంటే ఆయన గుండెల పైనే చెర్రి పడుకుంటుంది. యజమాని భార్య ను కూడా పక్కన పడుకోనివ్వదు చెర్రి. దీంతో చెర్రి కి ఉన్న మంచాన్ని కేటాయించి మరో మంచాన్ని వేసుకున్నారు. వేసవి కాలంలో ఎండలకు తట్టుకోలేకపోవటంతో చెర్రి కోసమే ఇటీవల ఓ జనరల్ ఏసీని ఇంట్లో ఏర్పాటు చేశారు. చెర్రికి అవసరం అయిన కాస్ట్యూమ్ ను లండన్, అమెరికాల నుంచి తెప్పించేవారు ఆ కుటుంబ సభ్యులు. స్పెషల్ బ్రాండెడ్ ఫుడ్ చెర్రికి ప్రత్యేకంగా అందించేవారు.
చెర్రికి బ్యాడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే...
అయితే జీవన ప్రయాణంలో ఎదీ శాశ్వతం కాదు. వయస్సు మీద పడటంతో చెర్రి అనారోగ్యానికి గురయ్యింది. లివర్ ఫెయిల్ కావటంతో ప్రత్యేకంగా వైద్యం  చేయించారు. అయితే వైద్యానికి చెర్రి శరీరం స్పందించలేదు. గడిచిన మూడు రోజులుగా అన్నం కూడా తినలేక చెర్రి కన్ను మూసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 
చెర్రి చనిపోయిన తరువాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులు బయటపడేయలేదు. ఇంటిలో మనిషి చనిపోతే ఎలాంటి అంతిమ సంస్కారాలు చేస్తామో... అదే తరహాలో  చెర్రి డెడ్ బాడిని ఇంటిలోనే పడక గదిలో ఉంచారు. ఇంటిలో చెర్రిని బెల్లంకొండ మస్తాన్ వరప్రసాద్ భార్య గీతాదేవి ప్రత్యేకంగా చేసుకునే వారు, చెర్రికి అన్నీ తానై వ్యవహరించారు. కుమారుడు విదేశాల్లో ఉండటంతో చెర్రిని మరో కొడుకుగా భావించి సపర్యలుచేశారు. చెర్రి చనిపోవటంతో ఇష్టం అయిన డ్రెస్ ను వేసి, అంత్యక్రియలు చేశారు. చెర్రిని భుజాన వేసుకొని మరి గీతా దేవి కారులో అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. అయితే మనిషికి అంత్యక్రియలు నిర్వహించే తరహాలోనే మేళతాళాలు, ఊరేగింపు, పాడె పై ఊరేగించాలని భావించారు. విజయవాడ నగరంలో పోలీసులు అనుమతులు, వంటి షరతులు ఉండటంతో  విరమించుకున్నారు. కారులోనే చెర్రి డెడ్ బాడిని మదురానగర్ లోని తమ సొంత స్దలం వద్దకు తీసుకువెళ్ళి అక్కడే అంత్యక్రియలు చేశారు. సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు. చెర్రిని తలుచుకొని గీతాదేవి ఎమోషన్ అవుతున్నారు.
వీధి కుక్కలను సైతం...
సాధారణంగా ఇంటిలో అందరూ కుక్కలను పెంచుకుంటారు. అయితే అవి అనారోగ్యానికి గురయితే, కొందరు వాటిని వదిలేస్తారు, మరికొందరు యజమానులు వాటికి వైద్యం అందిస్తారు. కాని చనిపోయిన తరువాత కూడా ఆప్యాయంగా పెంచుకున్న కుక్కకు సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించటం విశేషం.పెంచుకున్న కుక్కలను మాత్రమే కాదు, వీధి కుక్కలకు ప్రతి రోజు తాము ఆహారాన్ని అందిస్తామని, చెర్రికి అంత్యక్రియలు నిర్వహించిన బెల్లంకొండ కృష్ణార్జునరావు తెలిపారు. ఎవ్వరూ కూడా మూగ జీవాలను హింసించకూడదని అంటున్నారు.