కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకం అని ప్రచారం చేస్తున్న ఖమ్మం -దేవర పల్లి హైవే నిర్మాణం పూర్తి అయ్యింది. మొన్నామధ్య ప్రయోగాత్మకం గా సంక్రాంతి టైమ్ లో ఓపెన్ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను ప్రస్తుతం చిన్న చిన్న అడ్డంకుల వల్ల మూసి ఉంచారు. ఇప్పుడు అవన్నీ తొలగిపోవడం తో ప్రారంభోత్సవానికి రెడీ గా ఉంది.

Continues below advertisement

ఆంధ్ర -తెలంగాణ రాష్ట్రాలను మరింత దగ్గర చేసే హైవే 

ప్రస్తుతం తెలంగాణ లోని హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వరకూ (హైదరాబాద్ -మచిలీపట్నం నేషనల్ హైవే 65) హైవే లో ప్రయాణిచి అక్కడ నుండి  కోల్కతా హైవే (చెన్నై -కోల్కతా హైవే నెం.16) మీదుగా వాహనాలు వెళ్ళాల్సి వస్తోంది. ఇప్పుడు సూర్యాపేట దగ్గర లో ఉన్న టేకుమట్ల నుండి ఖమ్మం వరకూ ఆల్రెడీ నిర్మంచిన హైవే ను ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే తో కలిపితే హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56km దూరం కలిసి వస్తుంది అనే ఆలోచన తో ప్రారంభం అయిన గ్రీన్ ఫీల్డ్ హైవే ఇప్పుడు రెడీ అయింది.

Continues below advertisement

4609కోట్లు.. 162 కిమీ.. ఈ హైవే స్పెషాలిటీ ఏంటి ...!

ఈ హైవే మొత్తం పొడవు 162 km కాగా దీనిని నిర్మించడానికి 4609కోట్లు ఖర్చు అయింది. తెలంగాణ లో 105కిమీ,ఏపీ లో 57కిమీ పొడవు ఉంటుంది ఈ హైవే. ఈ హైవే మొత్తం లో 10 పెద్ద వంతెనలు 49 చిన్న వంతెనలు 295కల్వర్ట్ లు, 1ROB, 98 అండర్ పాస్ లు  ఉంటాయి. అలాగే ఈ హైవే లో ప్రతీ 2 కిమీలకు ఒక సీసీ టీవీ, రోడ్డు పొడవునా సోలార్ లైట్లు,QR కోడ్ లొకేషన్ ఉండడం వల్ల ప్రయాణికుల సేఫ్టీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు అని రాజమండ్రి ఎంపీ పురంధ్రీశ్వరి ఒక పోస్ట్ లో తెలిపారు.

టూ వీలర్ లకు నో ఎంట్రీ 

ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను వేగంగా వెళ్లే వాహనాలు, భారీ రావాణా వెహికల్స్ ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారు. అందుకే టూ వీలర్స్ కు ఎంట్రీ ఉండదు. మొత్తం హైవే ను యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే మోడల్ లో నిర్మించారు. అంటే హైవే లో ఎక్కడ పడితే ఎక్కడం, దిగడం వీలు పడదు. కేవలం 11 ప్రదేశాల్లో మాత్రమే  హైవే నుండి బయటకు రాగలం. ఖమ్మం,వెంకటగిరి,ధామసులపురం, వైరా,లింగాల, చింతల గూడెం,వెంసూరు, రేచర్ల,దేవులపల్లి, పొంగుటూరు, దేవరపల్లి ఇంటర్ చేంజ్ ల దగ్గర మాత్రమే హౌవే నుండి బయటకి రావడానికి అవకాశం ఉంటుంది.అయితే ప్రతీ 5కిమీ లకు అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి ఒక ఎమర్జెన్సీ ఓపెనింగ్ ఉంటుంది. ఈ హైవే ఓపెన్ అయితే హైదరాబాద్ -వైజాగ్ మధ్య ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం గా మారుతుంది అని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఎప్పుడు ఓపెనింగ్ అంటే...

నిజానికి ఖమ్మం -దేవరపల్లి హైవే ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. అయితే దేవరపల్లి కి 9కిమీ దూరం లో పొంగుటూరు సమీపంలో కొంత భూసేకరణ సమస్య రావడం వల్ల అక్కడ రోడ్డు నిర్మాణం లేట్ అయింది. ఇప్పుడా అడ్డంకులు కూడా తొలగిపోవడం తో హైవే రెడీ అయింది. ఈ ప్రతిష్టాత్మాక గ్రీన్ ఫీల్డ్ రహదారి ని ప్రధాని మోదీ తో వర్చువల్ గా ప్రారంభింపచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మే (2026) నెలలో ఖమ్మం -దేవరపల్లి హైవే ని ప్రజలకు అందబాటులోకి తెచ్చే ప్రయత్నం లో కేంద్రం ఉంది.