Kesineni Nani : టీడీపీ బెజవాడ ఎంపీ  కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు.  తెలుగు దేశం పార్టీకి ఉన్నదే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు . అందులో బెజవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని  ఒకరు. అయితే ఆయన వ్యవహర శైలి పార్టీకి మెదటి నుండి తలనొప్పిగానే మారింది. అయితే ఇప్పుడు ఏకంగా లోకేష్ నిర్వహించిన యువరగళం పాదయాత్రకు కనీసం ముఖం కూడా చూపించ లేదు. దీంతో ఆయన మరో సారి వార్తల్లోకి ఎక్కారు. ఎన్టీఆర్ జిల్లా పరధిలో జరిగిన లోకేష్ పాదయాత్రలో పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉన్న కేశినేని నాని అసలు పాల్గొనకపోవడంపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. కనీసం పలకరింపుగా కూడ ఆయన రాలేదు. ఎందుకిలా అంటే  మాట్లాడేందుకు కూడీ నాని ఇష్టపడటం లేదు. పాదయత్ర, లోకేష్, యువగళం వంటి పేర్లు నాని నోటి వెంట రావడం లేదు. 


సాధారణంగా పార్టీలో జరిగే కార్యక్రమాల్లో కీలక నేతలు ముందుండి నడిపించటం ఆనవాయితీ. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్దితుల్లో అయితే, పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక స్దానం ఉంటుంది. పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడ పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి స్దాయి ఉన్న లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో కేశినేని నాని హజరు కాకపోవటం సంచనలంగా మారింది. అయితే లోకేష్ పాదయాత్ర నిర్వహించి జిల్లా బోర్డర్ దాటుతుండగా మరో వైపున పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కొండపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే మీడియా   ఆయన్ను ప్రశ్నించింది. లోకేష్ పాదయాత్ర, యువగళం కార్యక్రమాలకు మీరెందుకు రాలేదని అడిగితే ఆయన వాటి గురించి మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడలేదు. కేవలం కొండపల్లి బొమ్మలు వాటి ప్రాముఖ్యతను వివరించారు. 


అంతే కాదు అంతర్జాతీయ ప్రాచుర్యం కలిగిన కొండపల్లి బొమ్మల గురించి మూడు రోజులు నిర్విరామంగా ప్రచారం చేసి రండి, అప్పుడు మాట్లాడదాం అంటూ దాటవేశారు. లోకేష్ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతుంది. అందుకు సందించిన రూట్ మ్యాప్ కూడ ముందుగానే రెడీ అవుతుంది. అయితే పార్టీలో కీలకంగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని లాంటి వ్యక్తి హజరుకాకపోవటం పై సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. కనీసం ఫలానా కారణం వలన రాలేదని కూడ నాని చెప్పకుండా దాట వేస్తున్నారు. అంత విభేదాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, కారణాలు ఎంటనేది పార్టీ నేతలను తొలిచేస్తోంది. 


అయితే నారా లోకేష్ తో కేశినేని నానికి విభేదాలు అనేది ఇప్పటివి కావని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఇద్దరి మద్య గ్యాప్ మెదలైందని అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం కాస్త, తీవ్ర విభేదాలకు దారి తీసిందని అటున్నారు.  అందులో భాగంగానే పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటి నేతలు ఎంపీ నానికి వ్యతిరేకంగా పని చేయటం వలన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ కారణంగా లోకేష్ పాదయాత్రకు నాని  తో పాటు ఆయన కుమార్తె కూడా దూరంగా ఉన్నారని చెబుతున్నారు.