IRCTC Tour: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఆధ్యాత్మిక పర్యటనలు చేసే వారికి ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తరచుగా ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. తాజాగా 7 జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కల్పిస్తూ ప్రత్యేక రైలును నడపనుంది. కనిష్టంగా ప్యాకేజ్ ధర ఒక్కొక్కరికి  ఒక్కొక్కరికి రూ. 21,000 ఉంటుంది. గరిష్టంగా ఒక్కొక్కరికి రూ.42,500గా నిర్ణయించారు. ఇందులో మహాకాళేశ్వరం నుండి ఘృష్ణేశ్వర్ మధ్య 7 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు.


వివరాలు.. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఐఆర్‌సీటీసీ జేజీఎం డీఎస్‌జీపీ కిశోర్‌ మంగళవారం విజయవాడ (Vijayawad) రైల్వేస్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు. 


విజయవాడ నుంచి రైలు బయల్దేరుతుందని చెప్పారు. ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్‌ల్లో ఆగుతుందని తెలిపారు. 12 రాత్రులు, 13 పగళ్లు ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో ఉజ్జయిని, మహాకాళేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ, ద్వారకాదిస్‌ దేవాలయం, నాగేశ్వర్‌ జ్యోతిర్లింగం, సోమనాథ్‌ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, నాసిక్, భీమశంకర్‌ జ్యోతిర్లింగం దర్శనం, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తదితర పూణ్యక్షేత్రలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాలను దర్శించుకోవచ్చు.






ఈ యాత్రలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. 3 కేటగిరీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఎకానమీ కింద స్లీపర్‌ క్లాస్‌‌లో ఒక్కొక్కరికి రూ. 21,000 ఉంటుంది. స్టాండర్డ్‌ కేటగిరిలో కింద థర్డ్ ఏసీ ఒక్కొక్కరికి రూ.32,500 ఉంటుంది. కంఫర్ట్‌ కేటగిరీలో 2 టైర్ ఏసీ రూ. 42,500 ధరగా నిర్ణయించారు. 


ఆసక్తి ఉన్న వారు IRCTC వెబ్‌సైట్ irctctourism.com ని సందర్శించడం ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు మరియు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు.  విజయవాడ కార్యాలయం 82879 32312, 92814 95848 నంబర్లకు సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ జేజీఎం డీఎస్‌జీపీ కిశోర్‌ తెలిపారు.


యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, 2 ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి. వ్యక్తిగత గుర్తింపు కార్డులను (original ID) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.