IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న టైంలో అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు, పని పూర్తి కాక ముందే 59 లక్షల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఊరట లభించింది.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో 112 రోజుల క్రితం సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చివరకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. నిడిగట్టు సంజయ్ 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వైసీపీ హయాంలో ఏపీ సీఐడీ అదనపు డీజీగా పని చేశారు అగ్నిమాపక శాఖ డిజీగా పని చేశారు. ఈ టైంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసింది. తర్వాత అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకుంది.
2023 సెప్టెంబర్‌లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో వార్తల్లో నిలిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ చీఫ్‌గా ఆయన వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. తర్వాత మార్గదర్శి కేసులో కూడా వ్యవహరించిన తీరు సరిగా లేదనే విషయంపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వీటికి సమాధానం చెప్పే క్రమంలో ప్రెస్‌మీట్ పెట్టిన సంజయ్ కాస్త అతిగా మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా కేసుల్లో వ్యవహరించిన తీరు, తర్వాత మీడియా సమావేశాల్లో చెప్పిన సమాధానాలతో వివాదాల్లో ఇరుక్కున్నారు.
2024 జూన్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, సంజయ్‌ను వెయిటింగ్ ఫర్ పోస్టింగ్‌లో పెట్టారు. 2024 డిసెంబర్‌లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు, పనిపూర్తి కాకముందే 59 లక్షలకుపైగా నిధులు చెల్లింపులు చేశారు. సీఐడీలో ఎస్పీ, ఎస్టీ అవగాహన కార్యక్రమాకు షార్ట్ టెండర్లు, 1.15కోట్లు దుర్వినియోగం చేశారు. 2025లో ఏసీబీ కేసు నమోదు, రిమాండ్, కస్టడీ పొడిగింపులు జరిగాయి. 2025 నవంబర్‌లో సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగించారు. అంటే మే 2026 వరకు ఆయనపై వేసిన సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది.