సృజనాత్మకత ఉండాలే కానీ కాగితాల నుంచి కూడా కళాఖండాలు సృష్టించ వచ్చని నిరూపించారు విజయవాడకు చెందిన మేడా రజని. స్కూల్‌ ఏజ్‌ నుంచే కాగితాలతో ఆడుకునే రజని భవిష్యత్తులో వాటినే ఉపాధిగా మలచుకుని మరికొందరికి చేయూతనిస్తున్నారు. 


పేపర్‌తో కళాపోషణ
చెత్తతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పడానికి విజయవాడకు చెందిన మేడ రజిని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఓ కాగితపు ముక్కతో ఎన్నో అద్భుతాలు చేయగలరు ఈమ. కాగితాలతో ఆమె అనేక కళాఖండాలను రూపొందించారు. వాటిని చూసినవారు ఎవరైనా అవాక్కు అవుతారు. తనలోని సృజనాత్మకతకు కళను జోడించి రంగులు మేళవించి కళాకృతులను తయారు చేసి వాటికి ప్రాణం పోస్తున్నారు. చూపరులను కట్టిపడేస్తున్నారు రజిని. 


విజయవాడలోని అయ్యప్ప నగర్... గణేష్ వీధిలో నివాసముంటున్నారు మేడా రజని. మచిలీపట్నం దగ్గర గిలకలదిండి గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన మోకా స్వాములు, లక్ష్మి దంపతుల చివరి సంతానం ఈమె. ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ పెరుగుతున్న టైంలోనే పేపర్‌ను కళాత్మకంగా రూపొందించి తోటి విద్యార్థులను అబ్బురపరిచేవారు. 


పదవ తరగతి వరకు చదువుకున్న రజనికీ భర్త మేడా సతీష్ రూపంలో మంచి క్రియేటివ్ సపోర్ట్ దొరికింది. తన భర్త సపోర్ట్‌తో సాధారణ గృహిణిగా ఉంటూ పిల్లలు సింధు, మంజునాథ్‌ ఆలనాపాలనా చూసుకుంటూ ఖాళీ సమయంలో కాగితాలతో అద్భుతాలు సృష్టించారు. అలా సరదాగా మొదలైన ఈ కళ క్రమంగా ఆమెకు ఉపాధి మార్గంగా మారింది. 


ప్రకృతిలో విరబూసిన పూల నుంచి ప్రేరణ పొంది తన సృజనాత్మక ఆలోచనలను జోడించి పర్యావరణహితంగా ఉండే కాగితాల ద్వారా ''పేపర్ క్విల్లింగ్" ఆర్ట్ ని సాధన చేశారు. అలా తోటి వారికి కూడా దీన్ని నేర్పించి తాను ఉపాధి పొందటమే కాకుండా తోటి మహిళలు ఆర్థికంగా బలపడేలా చేశారు. 


చుట్టుపక్కల గ్రామాల మహిళల రిక్వస్ట్ మేరకు ఆయా పల్లెలకు వెళ్లి పేద విద్యార్థులు, యువతకు, మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ కళ పట్ల అవగాహన కల్పిస్తూ ఉపాధి అవకాశాలను బోధిస్తూ తన వంతు సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. అంతటితో సంతృప్తి చెందకుండాశ్రీ "క్రియేషన్స్" సంస్థను స్థాపించి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్ & ఆన్ లైన్ నిర్వహిస్తున్నారు.


"సింధు డిజైన్స్" అనే పేరు మీద కుటీర పరిశ్రమను స్థాపించి పలు శుభకార్యాలకు అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ప్లవర్ వాజ్ లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్ తో చేసిన ఫోటో ఫ్రేములు, మైనంతో చేసిన కొవ్వత్తులు విక్రయిస్తున్నారు. 


క్రియేటివ్ స్కూల్ నుంచి మరింత స్పూర్తి
విజయవాడ "స్ఫూర్తి" క్రియేటివ్ ఆర్ట్ స్కూల్‌లో 2013 నుంచి 2021 వరకు క్రియేటివ్ ఆర్ట్ టీచర్ గా పని చేసి వేల సంఖ్యలో చిన్నారులకు పేపర్ క్విల్లింగ్ ఆర్ట్‌లో మెళకువలు నేర్పారు. ఈడుపుగల్లు "నలందా" విద్యనికేతన్ లో కొంత కాలం టీచర్‌గా పని చేసి విద్యార్థులు వివిధ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించేలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం గత సంవత్సర కాలం నుంచి ప్రముఖ మల్టీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ పబ్లిషర్స్ "ఆస్టాజెన్" సంస్థలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా, సపోర్టివ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూ నర్సరీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు వీడియో పాఠలను ప్రిపేర్ చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. 


విజయవాడ ఆర్ట్ సొసైటీలో సభ్యురాలిగా ఉంటూ, సంస్థ నిర్వహించే ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రసంసా పత్రాలను, ప్రోత్సాహకాలను పొందారు. ఇటీవల "స్పూర్తి" క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల విధ్యార్థులకు నిర్వహించిన "సేవ్ స్పారో" ఈవెంట్‌లో క్రియేటివ్ కాన్సెప్ట్ వర్క్ షాప్‌లో చిన్నారులకు పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ పట్ల అవగాహన కల్పించి మెళకువలను, టెక్నిక్‌లను నేర్పించారు. నాబార్డు, మెప్మా, హ్యాండి క్రాఫ్ట్స్. వీఎంసీ ప్రోత్సాహంతో పలుచోట్ల ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసారు.


 ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య నిర్వహించిన చిత్రకళాసంతలో పాల్గొని తన ప్రతిభను చాటారు రజిని.  విజయవాడ, హైదరాబాద్, చెన్నై, మధురై నగరాల్లో తన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్స్‌తో ప్రదర్శనలు నిర్వహించి క్రియేటివ్ క్రాఫ్ట్స్ ఔన్నత్యాన్ని పెంచారు. విజయవాడలో పేరెన్నికగల పలు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు పేపర్ క్రాఫ్ట్స్ తో చేసిన ఫోటో ఫ్రేములను, పలు రకాల జ్ఞాపికలను మారిన కాలానికి అనుగుణంగా రూపొందించి అందిస్తున్నారు. 


ఇటీవల స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సలాం ఇండియా ఆర్ట్ ఈవెంట్‌లో క్రియేటివ్ టీమ్ విభాగంలో ప్రదర్శన నిర్వహించి, కళాకారులు, కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. తాను చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ కళ ఈరోజు తనని ఈ స్థాయిలో నిలబెట్టి తన కలలు నిజం చేసుకునేందుకు ఆసరాగా ఉపయోగడిందని అంటున్నారు రజిని. ఈ కళలో రాణించటానికి ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలని నేటి యువతలో ఇది చాలా ఎక్కువ ఉందని చెబుతున్నారు.