Andhra Pradesh Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌2  పరీక్ష 23న నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని వాయిదా వేయాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇది సరి చేయకపోతే కచ్చితంగా చాలా మంది అభ్యర్థులు నష్టపోతారని అంటున్నారు. అందుకే వాటిని సరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

రోస్టర్‌లో తప్పులపై కొందరు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం వారి అభ్యంతరాలను తప్పు పట్టింది. గ్రూప్‌ 2 వాయిదా వేయడానికి నిరాకరించింది. దీంతో అభ్యర్థులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేసిన తర్వాత గ్రూప్‌2 మెయిన్‌ పరీక్ష నిర్వహించాలని అంటున్నారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్సీ చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

గ్రూప్‌ 2 అభ్యర్థుల సమస్యపై ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ షర్మిల స్పందించారు. గ్రూప్-2 మెయిన్స్‌కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల అభ్యర్థన పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని వాటిని సరి చేయాలని సూచించారు.  తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని... న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయని షర్మిల చెప్పారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకలతో జార్ఖండ్‌లో నోటిఫికేషన్ రద్దైందని గుర్తు చేశారు. ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇదే భయంతో అభ్యర్థులు వాటిని సరి చేయాలని ఆందోళన చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని షర్మిల నిలదీశారు. ఏపీపీఎస్సీ  మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా  అసహనం వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వారితో చర్చించాలని అన్నారు. 

Also Read: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన