Chalo VijayaWada Live : పోలీసుల ఆంక్షలు ఛేదించి విజయవాడ చేరుకున్న ఉద్యోగులు
ఉద్యోగుల సమ్మెపై మరిన్ని అప్‌డేట్స్ కోసం ఇక్కడ రిఫ్రెష్ చేయండి.
విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు.
పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్నారు ఉద్యోగులు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు ఉద్యోగులు. ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్నారు ఉద్యోగులు.
బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్నారు. జిల్లాల్లోనూ పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసు ఆంక్షలు ఛేదించుకుని విజయవాడ వచ్చారు వేలమంది ఉద్యోగులు. పీఆర్సీ జీవో రద్దుచేయాలని నినాదాలు చేస్తున్నారు. అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్నారు ఉద్యోగులు.
ఉద్యోగులు అనుకున్నది సాధించారు. విజయవాడలో సభ పెట్టాలనుకున్నారు పెట్టారు. అనుకున్నట్టుగానే పోలీసుల నిర్బంధాలను ఛేదించుకొని విజయవాడ చేరుకున్నారు. మారువేషాల్లో వివిధ మార్గాల్లో విజయవాడ చేరుకున్నారు. దీంతో బీఆర్టీ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన పి ఆర్ సి ఇవ్వాలని అడగడం నేరమా, అలా అడిగేందుకు రాజధానికి బయలు దేరిన ఉద్యోగులను ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రభుత్వానికి తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె మోహన్ రావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి విమర్శించారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో ముందుస్తు అరెస్టు చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి ధర్నాలు రాస్తారోకోలు చేపట్టేటప్పుడు సంఘీభావం తెలిపినని నేడు అధికారంలో ఉన్నప్పుడు ముందస్తుగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి ఇ గతులు చేపడితే ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని హితవు పలికారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వానికి ఇలా అరెస్టులు చేయడం సిగ్గు చేటన్నారు. ఐ ఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించి ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులను కాశిబుగ్గ సీఐ శంకరరావు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
వైజాగ్ ద్వారక బస్ స్టేషన్ లో పోలీసుల పహారా. ఝలక్ ఇచ్చిన ఉద్యోగులు. విడివిడిగా బ్రేక్-ఆఫ్ జర్నీ చేస్తూ ఒక రోజు ముందే విజయవాడ చేరుకున్నట్టు సమాచారం. ద్వారకా బస్ స్టేషన్ లో విజయవాడ వెళ్లే బస్సు లో ప్రతీ ప్రయాణికుడిని చెక్ చేశారు పోలీసులు.
మరోసారి విజయవాడ సీపీ కాంతిరాణాతో పీఆర్సీ స్టీరింగ్ కమిటి చర్చలు జరిపింది. చర్చలకు సీపీ పిలవడంతో వెళ్ళిన పీఆర్సీ స్టీరింగ్ కమిటి.. చలో విజయవాడకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేసింది. వినతిపత్రం ఇచ్చారు. అయినా అనుమతి రాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర పీఆర్సీ పోరాట సమితి పిలుపు మేరకు చలో విజయవాడకు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లో పోలీసులు అడుగడుగున తనిఖీలు చేపట్టారు.. ఈ క్రమంలో చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఉపాధ్యాయులను అడ్డుకున్నారు..
బస్సులను, రైళ్లను పూర్తిగా పోలీసులు తనిఖీ చేసి అనుమానితులను విచారించారు.. తిరుపతి ఈస్ట్ పోలీసులు 30 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకోగా, శ్రీకాళహస్తిలో పది మందిని, రేణిగుంటలో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. చిత్తూరు జిల్లా పిఆర్సి పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర పిఆర్సి సాధన సమితి పిలుపు మేరకు విజయవాడకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనమన్నారు.. స్వేచ్ఛ భారతదేశంలో పోరాడే హక్కు తమకు లేదని వారు ప్రశ్నించారు.. న్యాయాన్ని అడగడానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం ఎంత వరకూ సమంజసం అని ఉపాధ్యాయులు ప్రశ్నించారు.. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోక పోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదని వారు హెచ్చరించారు..
Background
ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నిర్వహించాలనుకున్న " చలో విజయవాడ" ర్యాలీకి ప్రభుత్వం నుంచి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మంగళవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో "చలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయితే చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
ఉద్యోగులపై పలు రకాల ఒత్తిళ్లు
జిల్లాల నుంచి ఎవరూ ఉద్యోగులు విజయవాడకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు కలెక్టర్ల ద్వారా హెచ్చరికలు పంపించినట్లుగా తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఉన్నతాధికారులు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశిస్తున్నారు. చాలా వరకు ఉద్యోగులు సెలవు పెట్టారు. అయితే సెలవులు అంగీకరించే ప్రశ్నే లేదని సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల ముందు నుంచే గృహనిర్బంధం చేయడంతో అనేక జిల్లాల ఉద్యోగ సంఘం నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు అన్ని జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక రోజు ముందు నుంచే జిల్లాల్లో వివిధ ఉద్యోగ సంఘాల నేతలను నిర్బంధిస్తున్నారు. విజయవాడకు వెళ్లకుండా ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల అడ్రెస్‌లను పోలీసులు సేకరించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విజయవాడకు వెళ్లేవారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం అందించారు. ఉద్యోగులు ఎవరైనా ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
విజయవాడలో పోలీసుల కఠిన ఆంక్షలు
పోలీసులు ర్యాలీ నిర్వహించాలనుకున్న బీఆర్టీఎస్ రోడ్డులో వందల కొద్దీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఎవరూ నిబంధనలు ఉల్లంఘించవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా హెచ్చరించారు. విజయవాడ నగరంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని... ప్రస్తుతం అమలులో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు మరియు గైడ్ లైన్స్ ప్రకారం అవుట్ డోర్ లొకేషన్‌లలో 200 మందికి మించరాదు. మరియు ఇండోర్ లొకేషన్‌లలో 100 మందికి మించకుండా సభలు జరగాలన్నారు. ఐదు వేల మంది కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
అసాంఘిక శక్తులు చొరబడతాయని పోలీసుల అనుమానాలు
చలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగస్తులతో సంబంధం లేని కొంతమంది బయటి వ్యక్తులు.. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.విజయవాడ నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సీఆర్పీసీ ప్రొసీడింగ్స్ కూడా అమలులో ఉన్నాయని దీని ప్రకారం 5మంది కంటే ఎక్కువ ఒక చోట ఉండకూడదని పోలీసులు ప్రకటించారు.
అందర్నీ అరెస్ట్ చేసినా పది మందితో అయినా సరే చలో విజయవాడ నిర్వహిస్తామన్న ఉద్యోగ నేతలు !
ప్రభుత్వ నిర్బంధంపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. నిర్బంధంతో పోరాటాన్ని ప్రభుత్వం ఆపలేదని, చలో విజయవాడను విజయవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగ కార్యాచరణ యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా చలో విజయవాడ విజయవంతం చేస్తామంటున్నారు. అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని మరోసారి కోరారు. కానీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో అందర్నీ అరెస్ట్ చేసినా పది మందితో అయినా బీఆర్‌టీఎస్‌లో చలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంటున్నారు. అటు పోలీసులు ఇటు ఉద్యోగుల పట్టుదలతో విజయవాడలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -