Ap Assembly Elections : ఉమ్మడి పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాలో చింతలపూడి (Chintalapudi )లో...అటు టిడిపి...ఇటు వైసిపి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఇద్దరు అభ్యర్థులు కొత్త వ్యక్తులే. దీంతో ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఆచంట (Achanta)లో మాజీ మంత్రులు పితాని సత్యానారాయణ (Pithani Satyanarayan), చెరువాడ శ్రీరంగనాథరాజు (Ragnanath Raju)తలపడనున్నారు.
ఆచంటలో మరోసారి పితాని
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి పోటీ చేయబోతున్నారు. రాష్ట్ర విభజన, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి...తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. పితాని వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో మంత్రిగా పని చేశారు. అనుభవంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ...స్థానికంగా బలమైన నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అతి విశ్వాసంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. ఆచంటలో బిసి ఓటర్లదే హవా. ఇప్పటికి ఆరు సార్లు అసెంబ్లీ బరిలో దిగిన పితాని...మూడు సార్లు విజయం సాధించి మూడు సార్లు ఓటమిపాలయ్యారు. వైఎస్, చంద్రబాబు కేబినెట్లలో వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు.
వైసీపీ అభ్యర్థిగా రంగనాథరాజు
సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజుకు వైసీపీ టికెట్ కేటాయించింది. జగన్ తొలి క్యాబినేట్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. మలి విస్తరణలో పదవి పోగొట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆచంట నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇటీవల పార్టీలో వర్గవిభేదాలు ఆయన్ని ఇరుకున పెట్టేవిధంగా ఉన్నాయి. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా పనిచేసిన రంగనాధరాజు... వచ్చే ఎన్నికల్లో ఆచంట నుంచే పోటిచేయనున్నారు. మరో నియోజకవర్గానికి మారతారని ప్రచారం జరిగినా...తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఆచంటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య హోరాహోరి పోరు జరిగే ఛాన్స్ ఉంది.
చింతలపూడిలో ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చిన టీడీపీ
చింతలపూడి నియోజకవర్గం సీటును తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సొంగా రోషన్ కుమార్ ను బరిలోకి దించింది. గత ఎన్నికల్లోనే చింతలపూడి టిడిపి టికెట్ ను సొంగా రోషన్ కుమార్ ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని తిరుగుతున్న రోషన్ కుమార్...వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున బరిలో దిగబోతున్నారు. విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న రోషన్ కుమార్ కు ఇపుడు టిక్కెట్ దక్కడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
వైసీపీ నుంచి మాజీ ఆర్టీఏ అధికారి
వైసిపి నుంచి కంభం విజయరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఏలూరులో ఆర్టీఏ అధికారిగా విధులు నిర్వహించిన విజయ రాజు వైసిపి చింతలపూడి సెగ్మెంట్ నుంచి బరిలో దింపుతోంది. 2019 ఎన్నికల్లో చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎలిజా స్థానంలో విజయరాజుకు టికెట్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థి ఇప్పటికే జనంలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నా...పార్టీ క్యాడర్ మొత్తం ఆయన వెనుక కలసి వెళ్లేందుకు వెనుకంజ వేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే కొత్త అభ్యర్ధిగా వచ్చిన విజయరాజుకు...కొన్ని వర్గాల నుంచి మద్దత్తు కరువయింది. సొంత పార్టీలోనే ఎలిజా వ్యతిరేక ప్రచారం, వర్గ పోరు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి.