AP Politics : పెనమలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారథి (Parthasarathi) వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ వీడింది. నూజివీడు (Nuzvidu) టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఎలాగైన ఈ సారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలన్న లక్ష్యంతో ఉన్న సారథి... నియోజకవర్గం మారేందుకు రెడీ అయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి... ఒకసారి బందరు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో ఉయ్యూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి వైఎస్సార్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు.


2009లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు అందించారు. 2014లో ఎంపీగా ఓడిపోయిన పార్థసారథి ఖాళీగానే ఉన్నారు. 2019లో మూడోసారి గెలిచిన ఆయనకు బీసీ కోటాతోపాటు సీనియర్ కాబట్టి మంత్రి పదవి దక్కుతుందని భావించి భంగపడ్డారు. తనకంటే జూనియర్‌ జోగి రమేశ్‌కు పార్టీ అధిష్టానం బీసీ కోటాలో మంత్రి పదవి ఇచ్చింది. దీంతో అసంతృప్తి చెందిన పార్థసారథి...చివరికి పార్టీ మారటానికి సిద్ధమయ్యారు. 


సీఎం జగన్ పై విమర్శలు? 
బీసీ సామాజిక బస్సు యాత్ర నుంచి సీఎం జగన్ పై విమర్శలు చేయటం ద్వారా... పార్టీని వీడుతున్నట్లు పార్థసారథి సంకేతాలు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వైసీపీ నుంచి బయటకు వెళ్తున్న తొలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే. బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని సాధ్యమైనంత వరకు పార్టీ నుంచి వెళ్లకుండా అధినాయకత్వం ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ పార్టీ నుంచి వెళ్ళటానికే సిద్ధమయ్యారు. ఆయన పార్టీ మారటానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ... ప్రధాన కారణం మాత్రం వైసీపీలో మంత్రి పదవి దక్కకపోవటమేనని తెలుస్తోంది. అధిష్టానం 2014లో ఎంపీగా వెళ్ళమంటే వెళ్ళానని, పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం బెజవాడలో తన స్థలాన్ని ఇచ్చానని పార్థసారథి అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయటంతో బీసీల్లో తన సామాజిక వర్గం ఎక్కువ ప్రభావం చూపిందని అంటున్నారు. పార్టీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటాన్ని పార్థసారథి జీర్ణించుకోలేక పోయారని సన్నిహితులు చెబుతారు.


పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాలనే నిర్ణయం వెనుక కూడా మంత్రి పదవే కీలక పాత్ర పోషిస్తోందనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. తనతోపాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరతారని... తన సామాజిక వర్గం బలంగా ఉన్న చోట వైసీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేస్తానని పార్థసారథి టీడీపీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని సారధి కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పెనమలూరు టికెట్ ఆశించిన పార్థసారథికి... అక్కడ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇవ్వలేమని టీడీపీ చెప్పినట్టు సమాచారం.


కృష్ణా జిల్లా పరిధిలో బీసీ కోటాలో మంత్రి పదవి ఖాళీ లేదని, నూజివీడు నుంచి పోటీ చేసి గెలిస్తే ఏలూరు జిల్లా కేటగిరీలో బీసీ కోటాలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పెనమలూరు కావాలని పట్టుబట్టిన పార్థసారథి మెల్లగా నూజివీడు వైపు షిఫ్ట్ అవుతున్నారు. నూజివీడు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి... తనకు సహకరించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రి పదవి మాత్రం మిస్ అవకూడదనే టార్గెట్‌తో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుత టీడీపీ ఇన్ చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు... పార్థసారథి టీడీపీ చేరితే ఏంటన్న దానిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.