బెజవాడ కార్పోరేషన్‌లో తెలుగు దేశం నేతలు లంచ్ బాక్స్‌లతో వినూత్నంగా నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశాలకు, ప్రతిపక్ష సభ్యులు తింటానికి మాత్రమే వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయటంపై తెలుగుదేశం కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి సీపీఎం, తెలుగు దేశం పార్టీకి చెందిన కార్పోరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమంపై చర్చ అంటూనే ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని తెలుగు దేశం, సీపీఎం కార్పోరేటర్లు వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే, దాడులు చేస్తూ, అక్రమంగా కేసులు పెడుతున్నారని నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరిన తమను అవమానించేలా భోజనం చేయటానికే ప్రతిపక్ష సభ్యులు వస్తున్నారంటూ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్లేట్ భోజనం 700 రూపాయలు..


విజయవాడ నగర పాలక సంస్థ నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో మధ్యాహ్నం సమయంలో భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనానికి 700రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఒక్కో ప్లేట్ భోజనం 700 పెట్టి వడ్డిస్తుంటే ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. దీనికి నిరసనగా తెలుగు దేశం పార్టీకి చెందిన కార్పోరేటర్లు ఇంటి నుంచి వస్తూనే తమతోపాటుగా క్యారియర్లు కూడా తీసుకువచ్చారు.


గరం గరంగా కౌన్సిల్ సమావేశం...


బెజవాడ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం గరం గరంగా సాగింది. ఇంటి పన్నుల పెంపుదల,ఖాళీ స్థలాలకు పన్నుల మోతపై కార్పోరేషన్‌లో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. అయితే ప్రతిపక్షాల నిరసనలను పట్టించుకోని అధికార పక్షం కౌన్సిల్ అజెండాలోని అంశాలపై చర్చించేందుకు ప్రయత్నించింది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు కూడా ఎదురు దాడి చేశారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


వైసీపీ నేతల కౌంటర్....


తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చారని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి దొంగల పార్టీ అని ఆ పార్టీ నేతలు పలువురు చోరీ కేసుల్లో అరెస్టయ్యారని అయన పేర్కొన్నారు. పగలు వీధుల్లో తిరుగుతూ రిక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలను, చోరీలను చేసేలా టిడిపి కార్యకర్తలను గద్దె ప్రోత్సహిస్తున్నారని అయన ఆరోపించారు. 18వ డివిజన్ టిడిపి అభ్యర్థిగ పోటీ చేసిన పీరుబాబుతోపాటు పలువురు టీడిపి నేతలు చోరీ కేసులో అరెస్ట్ అయ్యారని వివరించారు. నియోజకవర్గంలోనీ ఆన్ని డివిజన్లలో టిడిపి, వైసిపి నేతలపై ఉన్న కేసుల గురించి చర్చించేందుకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రాణిగారి తోటలో జరిగిన చంద్రబాబు కార్యక్రమంలో ఆయన సమక్షంలో టీడిపి తీర్థం పుచ్చుకున్న వారందరూ దొంగలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులేనని ఆధారాలతో నిరూపితం అయిందన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన నాయకులపై కేసులు ఉంటే వారిని ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు లంచ్ బ్యాగ్ లతో కౌన్సిల్ లోకి రావటాన్ని వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు.