AP Inter Results 2023 : ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయనో... బాగా రాసినా మంచి ఫలితం రాలేదనో బాధపడుతున్న వాళ్లకు మరో అవకాశం. ఫలితాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా... అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు. ఇవాల్టి నుంచి మే 6 వరకు ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను బోర్డుకు విన్నవించుకోవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి కూడా అప్లై చేసుకోవాలంటున్నారు ఇంటర్ అధికారులు. రీ వెరిఫికేషన్‌లో ఫలితం ఆలస్యమైనా, లేకుంటే మొదటి లాంటి ఫలితమే వచ్చినా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసుకునే వీలుంటుంది అంటున్నారు. అందుకే ఎవరూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు అప్లై చేశామని ధీమాతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ అప్లై చేయడం నిర్లక్ష్యం వద్దంటున్నారు.
మే 24 నంచి జూన్ 1వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా త్వరలోనే మొదలు కానుంది. పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు కొద్ది రోజుల్లో రిలీజ్ చేయనుంది. ప్రాక్టికల్స్‌లో తప్పిన వారికి కూడా మరో అవకాశం ఇస్తోంది ఇంటర్ బోర్డు. జూన్ ఐదు నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు పెడుతోంది.
ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి
సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి
ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలికలు పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బాలురుది పైచేయి అని వెల్లడించారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలలో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.
ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో మొత్తం 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా రెండో స్థానంలో, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడోస్థానంలో నిలిచాయి.
ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.