అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదివరకే విచారణకు హాజరై పలు విషయాలు అధికారులకు తెలిపిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అని, తప్పించుకునేందుకే దొరికిన దొంగలతో పాటు ఈ కేసులో దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో తాను ఏ రూపాయి ముట్టలేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని.. మిగతా వారి బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానంటూ బాంబు పేల్చారు.
దాంతో విజయసాయిరెడ్డి ఎవరి పేర్లు చెప్పనున్నారు, ఇంకా కేసులో ఎవరు ఇరుక్కోనున్నారు. ఆయన ప్లాన్ ఏంటి అని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి పాలిటిక్స్ నుంచి తప్పుకుని రాజకీయాలు మొదలుపెట్టారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ తమ పార్టీ వారిపై లేనిపోని ఆరోపణలు చేసి, ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో కీలకమైన వైసీపీ మద్దతుదారుడు రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడ తరలించారు. నేడు లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, నోటీసులు జారీ చేస్తున్నా మార్చి నుంచి సిట్ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు రాజ్ కసిరెడ్డి. ఇప్పటికే నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినా విచారణకు మాత్రం కాలేదని, హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. మొదటి నోటీసుకు స్పందించిన రాజ్ కసిరెడ్డి త్వరలో విచారణకు హాజరవుతా అన్నారు. తాను తప్పుచేయలేదని కోర్టుల్లో ఊరట లభించాక అధికారులకు ప్రశ్నలకు బదులిస్తానన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన రాజ్ కసిరెడ్డి కొన్ని రోజులుగా ఆయన దుబాయ్‌లో తలదాచుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.