Drone show at Punnami Ghat on the Krishna River was a success : ఆకాశం నుంచి చుక్కలు దిగి వచ్చి నృత్యం చేసినట్లుగా లయబద్దంగా డ్రోన్లు చేసిన విన్యాసాలతో విజయవాడ కృష్ణాతీరం పులకరించిపోయింది. ఐదు వేలకు పైగా డ్రోన్లతో జరిగిన మెగా షో అద్భుతంగా సాగిపోయింది. ప్రత్యక్షంగా ఈ షోను చూసేందుకు ఎనిమిది వేల మందికి అవకాశం కల్పించారు. అయితే  బెంజిసర్కిల్‌, రామవరప్పాడు, వారధి, బస్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల వద్ద భారీ డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి డ్రోన్ షోను చూశారు.   



విజయవాడ డ్రోన్‌ షోకు ఐదు గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ వచ్చాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ధ్రువపత్రాలు అందించారు. 


1) లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ లో గిన్నిస్ రికార్డు
2) నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్ మార్క్‌ సృష్టితో మరో గిన్నిస్ రికార్డ్
3) అతిపెద్ద విమానాకృతి (Largest Plane Formation)లో గిన్నిస్ రికార్డ్
4) డ్రోన్లతో అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి క్రియేట్ చేసి గిన్నిస్ రికార్డ్ 
5) అతిపెద్ద ఏరియల్‌ లోగో ఆకృతితో ఐదో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు


పున్నమిఘాట్‌లో  జరిగిన ఈ డ్రోన్ షో లో మొత్తం ఏడు థీమ్‌ చిత్రాలను  ప్రదర్శించారు.  విమానయానానికి  తద్వారా డ్రోన్లయానానికి పితామహుడిగా  పేరు పొందిన రైట్‌ బ్రదర్స్‌ చిత్రాన్ని ముందుగా ఆవిష్కరించారు.  ఆ తర్వాత భారీ బోయింగ్‌ విమానం, డ్రోన్‌, రాజధాని అమరావతిని స్మరించేలా ధ్యానబుద్ధుడు, గ్లోబ్‌ చిత్రాలను డ్రోన్ల ద్వారా ఆవిష్కరించారు.   జాతీయ జెండాతో పాటు ఐసీఏవో లోగోను ఆవిష్కరించారు.             



మొత్తం 5,500 డ్రోన్లతో ఆకాశంలో ఈ సప్తవర్ణ చిత్రాలను సృష్టించారు.  ఈ చిత్రాలన్నీ వరుస క్రమంలో చక్కగా కనిపించటానికి డ్రోన్లను ఆయా స్థానాల్లో నిలబెట్టేందుకు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ కూడా వినియోగించారు.      



డ్రోన్ల షోకు ముందుగా బబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.  డ్యాన్సర్ల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తర్వతా లేజర్‌ బీమ్‌ షో కూడా నిర్వహించారు.  చివరిగా బాణాసంచా పేలుళ్లు ప్రదర్శనలో హైలైట్‌గా నిలిచాయి.  



అంతకు ముందు ఉదయం  విజయవాడలో   డ్రోన్ సమ్మిట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుతో  పాటు , కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. డ్రోన్లను ప్రదర్శించేందుకు వచ్చే వారితో పాటు పెద్ద ఎత్తున  సదస్సులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్న వారు వచ్చారు.  డ్రోన్ టెక్నాలజీ, భవిష్యత్ అవకాశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో డ్రోన్లదో కీలక పాత్ర అని నిపుణులు తేల్చారు. ఏ ఏ రంగాల్లో వినియోగించే డ్రోన్లకు డిమాండ్ ఉంటుందో చర్చించారు.