Chandrababu Naidu: 52 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉండి విడుదలైన తమ అభిమాన నేత కోసం అశేష జనవాహిని కదిలి వచ్చింది. పోలీసుల ఆంక్షలను కాదని భారీగా ప్రజలకు చంద్రబాబును చూసేందుకు తరలి వచ్చారు. అడుగడుగునా నీరాజనం పలికారు. దారి పొడవునా అందరికీ కారు నుంచే అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. 






మంగళవారం సాయంత్ర నాలుగు గంటలకు ప్రారంభమైన చంద్రబాబు జర్నీ బుధవారం వేకువ జాము ఐదు గంటల వరకు సాగింది. అంటే దాదాపు 13 గంటల పాటు ఆయన జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు ఐదు గంటల సమయంలో ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు భార్య భువనేశ్వరి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. 






మంగళవారం మధ్యాహ్నం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు షూరిటీగా దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు సంతకాలు చేశారు. చెరో లక్ష రూపాయల బాండ్‌ పేపర్‌లు కోర్టుకు సమర్పించారు. అనంతరం చంద్రబాబు విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు గంటల సమయంలో చంద్రబాబును విడుదల చేస్తూ జైలు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కోర్టు విధించిన షరతులు సీబీఎన్‌కు వివరించారు. ఆయన సంతకాలు తీసుకున్నారు. 


బెయిల్‌  ప్రక్రియ ముగిసిన తర్వాత 4.15 ప్రాంతంలో చంద్రబాబు జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఆయన కోసం కాన్వాయ్ సిద్ధంగా ఉంది. అయినా కాన్వాయ్ ఎక్కకుండా రెండ గేట్ వరకు నడుకుంటూ వచ్చారు. ఆయన బెయిల్‌పై సాయంత్రం విడుదల అవుతారని తెలుసుకున్న అభిమానులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలతో రాజమండ్రి జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా బారికేడ్‌లు పెట్టినా జనం మాత్రం ఆగలేదు. వాటిని నెట్టుకొని దూసుకొచ్చారు. 


జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబును చూసి టీడీపీ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను చూసి చంద్రబాబు కూడా ఎమోషన్ అయ్యారు. వాటిని మనసులోనే దాచుకొని చిరునవ్వుతో అందరిని పలకరించారు. మనవడు దేవాన్ష్‌ను హత్తకున్నారు. చంద్రబాబుకు బ్రహ్మణి టీడీపీ జెండాను అందించారు. బాలకృష్ణ దేవుడి ప్రసాదాన్ని తినిపించారు. 


అక్కడే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు విజయవాడ బయల్దేరారు. జనవాహిని మధ్య రాజమండ్రి దాటుకొని రావడానికి ఆయనకు మూడు గంటల సమయం పట్టింది. ఒక్క రాజమండ్రే కాదు. ఆయన కాన్వాయ్‌ వచ్చే పరిసరాలు మొత్తం జనం, అభిమానులు, టీడీపీ జనసేన కార్యకర్తలతో నిండిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. చంద్రబాబు రాజమండ్రి తర్వాత రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, మీదుగా ఆయన పయనం సాగింది. 






రాజమండ్రి నుంచి విజయవాడ వరకు అదే పరిస్థితి కనిపించింది. ఎక్కడా చంద్రబాబు బయటకు రావడం కానీ చేయలేదు. ఆయనతోపాటు ఉన్న అచ్చెన్న ఇతర నాయకులు కార్యకర్తలను సర్ది చెప్పి తప్పుకోవాలని రిక్వస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నందున ఆయన బయటకు రాకూడదని... ర్యాలీల్లో పాల్గొనకూడదని అభిమానులకు వివరిస్తూ సాగింది పయనం. దారి పొడవునా చంద్రబాబుకు సంఘీభావంగా మానవహారంలా నిల్చున్న ప్రజలకు ఆయన కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. 


చంద్రబాబు విజయవాడ చేరుకునే సరికి రాత్రి 4 గంటలు దాటింది. అయినా ఆయన రాక కోసం సాయంత్రం నుంచి ప్రజలకు వేచి చూస్తున్నారు. నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకు బెంజిసర్కిల్‌లో అపూర్వస్వాగతం పలికారు. తెల్లవారుజామున 4.45గంటలకు బెంజిసర్కిల్‌కు చేరుకుంది చంద్రబాబు కాన్వాయ్. విజయవాడ నగరానికి చెందిన మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే మహిళల్లో పెల్లుబికిన ఆనందం, హారతులు పడుతూ నీరాజనాలు పట్టారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనూరాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు ఈ స్వాగత కార్యక్రమంలో ఉన్నారు.


బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్ ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లికి దారి మళ్లించారు. ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న అభిమానులు, ముఖ్యంగా మంగళగిరి కార్యకర్తలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఎంపి కేశినని నాని కుమార్తె శ్వేత నేతృత్వంలో పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలికారు.