Gade Sai Krishna Missing Issue | విజయవాడ: తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుడైన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండైన సీఐ నాగరాజుపై 127 (4), 127(6), 103(1), 238 బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసు విచారణాధికారిగా ప్రభుత్వం నియమించిన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ నేడు (జూన్ 19న) విజయవాడకు చేరుకోనున్నారు. నగరంలో అడుగుపెట్టిన వెంటనే ఆయన ఈ కేసు తీవ్రతపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
విజయవాడ పర్యటనలో భాగంగా ఎస్పీ నరసింహ కిశోర్ తొలుత రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబులను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక వివరాలు, ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలపై వారితో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన అనంతరం, ఎస్పీ నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేయనున్నారు.
రంగంలోకి పవర్‌ఫుల్ ఆఫీసర్..
సాయికృష్ణ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు ఏపీ ప్రభుత్వం పవర్ ఫుల్ ఆఫీసర్‌ను రంగంలోకి దింపింది. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నరసింహ కిషోర్ వంటి అధికారికి బాధ్యతలు అప్పగించడం కేసు సీరియస్ నెస్‌ను తెలుపుతుంది. పోలీసులు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదనే ప్రభుత్వం ఆయనను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది.
ఈ కేసులో ప్రధానంగా వినిస్తున్న ఆరోపణ ఏంటంటే.. సాయికృష్ణను విచారణ పేరుతో కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే అతడు మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయం చేశారని ఆరోపణలున్నాయి. ఎస్పీ నరసింహా కిషోర్ శుక్రవారం నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడ లాగ్ బుక్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఆయన విచారించనుండటంపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సస్పెన్షన్ వేటు పడిన సీఐ నాగరాజుపై కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నిప్పులు చెరుగుతూ.. సాయికృష్ణను పోలీసులే చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపించారు.
ఈ దారుణంలో కృష్ణలంక సీఐతో పాటు విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ఆక్షేపిస్తూ, దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మే నెలలో పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను జగన్ గుర్తుచేశారు. ఆ తర్వాతే మే 9న సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, గోళ్లు పీకి చంపేశారని ధ్వజమెత్తారు. కొడుకు కోసం వచ్చిన తల్లిని సీఐ హేళన చేశారని, డీజీపీ కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోలేదని జగన్ తీవ్రంగా విమర్శించారు.
