Ambati Rambabu : మాజీ మంత్రి వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదు అయింది. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇంకా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ ధర్నాలకు పిలుపునిచ్చింది. వెన్నుపోటు దినంగా పేర్కొంటు అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులతో ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది. 

గుంటూరులోని సిద్ధార్థనగర్‌లోని నివాసం ఉంటున్న అంబటి రాంబాబు అక్కడి నుంచి ర్యాలీ చేపట్టారు. అనుచరులతో కలిసి టూవీలర్‌పై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. అలా వెళ్లడానికి అనుమతి లేదని చెప్పడంతో అక్కడి నుంచి వేరే మార్గాన్ని ఎంచుకుున్నారు. కుందులు రోడ్డు జంక్షన్‌లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ర్యాలీ చేపట్టారు. కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న తర్వాత మళ్లీ పోలీసులు ఆపారు. ర్యాలీకే అనుమతి లేదని చెప్పేశారు. 

ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు చెప్పడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు వారితో వాగ్వాదానికి దిగారు. ఎలా ఆపుతారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్న పట్టాభిపరం సీఐ గంగా వెంకటేశ్వర్లపై రుసరుసలాడారు. దీనికి అటు నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన వచ్చింది. ర్యాలీ ఎలా ఆపుతారో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ర్యాలీకి అనుమతి లేదని పోనిచ్చేది లేదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. 

వాగ్వాదం జరుగుతున్న టైంలో అంబటి రాంబాబు సహనం కోల్పోయారు. పోలీసులపై బూతలు తిట్టారు. దీంతో మర్యాదగా మాట్లాడండి అంటూ సిఐ రిప్లై ఇచ్చారు. అయినా తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన రాంబాబు పళ్లు కొరుకుతూ ఎస్సైవేపు చూశారు. ఏటీ నాలుకు మడతపెట్టి పళ్లు కొరుకుతున్నారంటీ అంటూ సీఐ ప్రశ్నించారు.ఇలాంటి బెదిరంపులకు ఎవరూ భయపడిపోరని స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. 

అంబటి రాంబాబు, సిఐ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ గొడవ తర్వాత పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో రాంబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బూతులు తిట్టినందుకు రాంబాబుపై పోలీసులు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురంలో పోలీసు స్టేషన్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై సెక్షన్ 353 ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. 

ఈ కేసులకు భయపడాలా?ఈ కేసులపై అంబటి రాంబాబు స్పందించారు. కాపులపై కేసులు తిరగదోడుతామన్న వాళ్లు తనపై కేసులు పెట్టకుండా ఉంటారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు తాను భయపడబోనని చెప్పుకొచ్చారు.