Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారుతున్న రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి నాని భార్య జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం తన లాయర్‌తో వచ్చి బందరు తాలూకా పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. ఆమెను ఆర్‌పేట సీఐ ఏసు బాబు విచారించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఆమెను పోలీసులు విచారించారు. ఇప్పటికే ఆమెకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె పోలీసు విచారణకు హాజరయ్యారు.
పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్‌లో బియ్యం మాయమవటంపై కేసు నమోదు అయింది.దీని వెనుకాల మాజీ మంత్రి ఫ్యామిలీ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ కేసులో జయసుధను ఏ1గా ఉంచారు. మాజీ మంత్రి పేర్ని నానిని కూడా నిందితుదల జాబితాలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెట్టారాని ఆరోపించారు. గోదాము మేనేజర్ బేతపూడి మానస్‌తేజ ద్వారా దందా చేసినట్టు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. బియ్యం అమ్మిన డబ్బులు వివిధ మార్గాల్లో నానికి చేరినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ దందా కోసం వేబ్రిడ్జిని కూడా ట్యాంపర్ చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో జయసుధ ఏ1 ఉంటే... గోడౌన్ మేనేజర్ మానస్‌తేజ ఏ2, పౌరసరఫరాల శాఖ టెక్నికల్ డిపార్టమెంట్ అసిస్టెంట్ మేనేజర్ చింతం కోటిరెడ్డి ఏ3, లారీడ్రైవర్ బొట్ల నాగ మంగారావు ఏ4, రైస్‌మిల్లును లీజుకు తీసుకుని నడిపిస్తున్న బొర్ర ఆంజనేయులును ఏ5గా చేశారు. వీరిలో జయసుధ మినహా మిగిలిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నాని ప్రస్తానవ రావడంతో ఆయన్ని ఏ 6గా చేర్చారు.
ట్యాంపరింగ్ చేసిన వే బ్రిడ్జిని అనుకూలంగా మార్చుకొని కేసును తప్పించుకునేందుకు యత్నించారని పోలీసులు ఆరోపణ. అందుకే అందులో వచ్చిన సాంకేతిక కారణాలతో నిల్వ తక్కువ వచ్చిందని దానికి పూర్తి బాధ్యత తీసుకుంటామని జయసుధ అధికారులకు లేఖ రాశారు. కృష్ణాజిల్లా జేసీకి నవంబర్‌లో లేఖ రాయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలకు వెళ్తే అక్కడి వ్యక్తులు సహకరించ లేదు. దీంతో గోడౌన్ తాళాలు బ్రేక్ చేసి తనిఖీలు చేపట్టారు. మొత్తం రూ.1.68 కోట్ల విలువైన 378.86 టన్నుల పరిమాణం గల 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు ఈ తనిఖీల్లో బయటపడింది.
పెడన మండలానికి చెందిన లారీడ్రైవర్ బొట్ల నాగ మంగారావు, రైస్‌మిల్లు లీజుదారుడు బొర్ర ఆంజనేయులు సాయంతో రేషన్ బియ్యాన్ని గూడురుకు చెందిన డొక్కు నాగరాజుకు అమ్మేశారు. కిలో రూ.18 చొప్పున వచ్చిన డబ్బులను ఫోన్ పే ద్వారా మానస్‌తేజకు పంపించారు. తర్వాత ఆ డబ్బులు పేర్ని నానికి చేరినట్టు వెల్లడించారు. 2023 అక్టోబరు నుంచి 2024 నవంబరు మధ్యలో చెల్లింపులు జరిగట్టు తేల్చారు. ఈ దందాకు సహకరించిన మంగారావుకు రూ.2.21 లక్షలు, ఆంజనేయులుకు రూ.1.03 లక్షల చెల్లించినట్టు కూడా రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
జయసుధ పేరిట 2022 మేలో గోడౌన్స్ ప్రారంభించారు. 2023 నుంచి పౌరసరఫరాల సంస్థకు అద్దెకు ఇస్తున్నారు. మొదటి నుంచి మానస్ తేజ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయినా రీసెంట్‌గా పనిలో చేరినట్టు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గోడౌన్‌లో బియ్యం తగ్గినట్టు మొదట పౌరసరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ చింతం కోటిరెడ్డి గుర్తించారు. అయితే పేర్ని నాని ప్రలోభాలకు లొంగిపోయారరని తెలిపారు.