Balakrishna About Chandrababu Arrest:
విజయవాడ: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై గన్నవరం విమానాశ్రయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ప్లాన్ చేశారంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును టీడీపీ శ్రేణులతో పాటు ఏపీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కోసం పార్టీయే కాదు, ప్రజలందరూ ఉద్యమిస్తారు అని ఇకనైనా ఏపీ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసు ఎప్పుడో జరిగిన విషయం అని, ఇందులో ముద్దాయిని అరెస్ట్ చేశారని కేసు కోర్టులో ఉందన్నారు. కానీ చంద్రబాబును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పేరు యాడ్ చేసి ఇరికించాలని చూస్తున్నారని బాలకృష్ణ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేసి చాలా చాలామంది నిరుద్యోగ యువతకు శిక్షణను కల్పించారని చెప్పారు.
జగన్ హయాంలో మూడు రాజధానులని మూడు సంవత్సరాలు కాలయాపన చేశారని విమర్శించారు. నవరత్నాలు పేరిట 80 వేల కోట్లు అప్పులు చేశాడు ఎవరు తీరుస్తారు ఆ బకాయిలు అని ప్రశ్నించారు. వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎం జగన్ కి తెలియదు.. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది గుంతలు తప్ప, అభివృద్ధి శూన్యం ఒక రోడ్డైనా ఎప్పుడైనా వేసిన దాఖలాలు లేవన్నారు.
ఎయిర్ పోర్టు నుంచి సిట్ ఆఫీసుకు చేరుకున్నారు బాలకృష్ణ, బ్రాహ్మణి. సిట్ ఆఫీసులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఇదివరకే భువనేశ్వరి, నారా లోకేస్, నందమూరి రామక్రిష్ణ అక్కడికి చేరుకున్నారు. అయితే అధికారులు చంద్రబాబును కేసు విషయంపై ప్రశ్నిస్తున్నారు. 5వ అంతస్తులో చంద్రబాబు విచారణ జరుగుతుండగా, 4వ అంతస్తులో ఆయన కుటుంబసభ్యులను కూర్చోబెట్టారు. విచారణ అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలకు తరలించనున్నారు. ఆ తరువాత మేజిస్ట్రేట్ ఎదుట చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు బాలకృష్ణ, బ్రాహ్మణి..
అంతకుముందు బాలకృష్ణ, ఆయన కూతూరు బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నేటి ఉదయం చంద్రబాబును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేశారు. సాయంత్రానికి తాడేపల్లి లోని కుంచనపల్లి సీఐడీ సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించారు. చంద్రబాబు అరెస్టుపై బాలకృష్ణ బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిందని ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో కోర్టు ఏపీ సర్కారుకు చీవాట్లు పెట్టిందన్నారు. తాను ఎలాగూ జైళ్లో ఉన్నానని, చంద్రబాబును సైతం జైల్లో పెట్టాలని జగన్ తాపత్రయం అని, ఛార్జిషీటు లేకున్నా, కేసులో పేరు లేకున్నా కక్ష సాధింపు ధోరణితో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారని ఆరోపించారు.