Dussehra Special Buses In APSRTC: దసరా పండగ సందర్భంగా ఏపీలోని ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) తరపున 6,100 స్పెషల్ సర్వీస్ లు నడిపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అంటే దసరా పండగ(Festival)కు ముందు 3,040 బస్సులు(Buses) అందుబాటులో ఉంటాయి. ఇక దసరా మూడు రోజుల రద్దీ పెద్దగా ఉండదు కాబట్టి స్పెషల్ సర్వీస్ లకు బ్రేక్ ఇచ్చారు అధికారులు. దసరా తర్వాత అంటే అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు 3,060 స్పెషల్ సర్వీస్ లను ఏపీఎస్ఆర్టీసీ నడిపేందుకు నిర్ణయించింది. 


తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే ప్రభుత్వాలు సెలవలు ప్రకటించాయి. హాస్టల్స్ లో చదువుకుని విద్యార్థులంతా సెలవల సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ఇక ఉద్యోగులు కూడా పండగ సెలవలకు సొంత ప్రాంతాలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో బస్సు సర్వీస్ లను ఏపీఎస్ఆర్టీసీ పెంచింది. అయితే ఈసారి స్పెషల్ సర్వీస్ ల పేరుతో స్పెషల్ చార్చీలు మాత్రం ఉండవని తేల్చి చెప్పింది. స్పెషల్ సర్వీస్ లు అయినా కూడా చార్జీలను పెంచడం లేదని ప్రకటించింది. ఇది ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశం. 


డిస్కౌంట్ కూడా..
రాను పోను ప్రయాణ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకునేవారికి ఏపీఎస్ఆర్టీసీ రాయితీ కూడా ప్రకటించింది. తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ రేటులో 10శాతం రాయితీ ఇస్తారు.  విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ బస్సులకు కూడా ఈ రాయితీ సౌకర్యం వర్తిస్తుంది. ఏపీలోని జిల్లా కేంద్రాల మధ్యే కాకుండా తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు, అక్కడినుంచి వచ్చే వారికోసం కూడా ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.


తెలంగాణకంటే ఎక్కువగా..
అటు తెలంగాణ ఆర్టీసీ కూడా దసరా సందర్భంగా స్పెషల్ సర్వీస్ లను అందుబాటులోకి తెచ్చింది. 6వేల సర్వీస్ లు దసరా సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) ఇదివరకే ప్రకటించింది. ఈ సర్వీస్ లను ఇటు ఏపీ ప్రజలు కూడా వినియోగించుకుంటారు. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ మరో 100 సర్వీస్ లు అదనంగా నడిపేందుకు నిర్ణయించింది. అంటే తెలంగాణ ఆర్టీసీ 6వేలు, ఏపీ ఆర్టీసీ 6,100 మొత్తంగా 12,100 స్పెషల్ సర్వీస్ లు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దసరా సందర్భంగా అందుబాటులో ఉంటాయనమాట. దసరా సందర్భంగా సెలవల్లో విహారయాత్రలు వెళ్లేవారికి కూడా ఈ స్పెషల్ సర్వీస్ లు మరింత ఉపయోగకరంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు. దసరా సెలవల్లో ఎక్కువగా విహార యాత్రలకు వెళ్తుంటారు. అటు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కూడా స్పెషల్ సర్వీస్ లు ఉపయోగపడతాయని అంటున్నారు. 


బస్సులతోపాటు దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 650 స్పెషల్ ట్రైన్స్ ని నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. నవంబర్ నెలలో కూడా వీటిని కంటిన్యూ చేయడానికి షెడ్యూల్ వేసింది. పండల సందర్భంగా రద్దీని నివారించేందుకు స్పెషల్ సర్వీస్ లు నడుస్తాయి. అయితే రైల్వే మాత్రం స్పెషల్ సర్వీస్ లకు స్పెషల్ చార్జీలను ఫిక్స్ చేస్తుంది. 


Also Read: మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన