APJAC News: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కెఎస్ జవహర్ ను కలిశారు. రెండో దశ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీస్ ను సీఎస్ కు అందజేశారు. ఈ క్రమంలోనే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డిమాండ్లు పూర్తి స్థాయిలో పరిష్కారం కానందున ఉద్యమం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇది తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదని వివరించారు. ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు, దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదని గుర్తుచేశారు. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఉద్యోగులు సంతోషంగా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా చేయగలమని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని.. ఉద్యోగులకు ఎంత చెల్లించాలో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గత నెలలో ప్రభుత్వ తీరుపై నమ్మకం లేదన్న ఉద్యోగులు


ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం, మంత్రుల కమిటీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తాము ఇచ్చిన వినతి పత్రంపై చర్చ చేయకుండా పాత సమస్యలపై మాట్లాడుతున్నారని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారని, అయితే దాని పై ఇంత వరకు క్లారిటీ లేదని బొప్పరాజు పేర్కొన్నారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సిన 2 వేలకోట్లు సెప్టెంబర్ లోపు చెల్లిస్తామని, డీఎ, ఎరియర్స్ ఎంత ఇవ్వాలి అన్నది స్పష్టత ఇవ్వకపోవటం వెనుక అంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాము చెప్పిన అంశాలపై చర్చ లేకుండా వాళ్ళు చెప్పాలనుకున్నవి చెప్పి వెళ్లిపోయారని ..11వ పీఆర్సీ, పే స్కేల్ పై స్పష్టత లేకుండా ఉందని, ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.


జీతాలు ఒకటో తేదీన  ఇవ్వాలని కోరినా మంత్రుల కమిటీ స్పందించలేదని, సీపీయస్ ఉద్యోగుల రూ. 1300 కోట్ల రూపాయల డబ్బులను ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఏప్రిల్ నుంచి జీపీఎస్ కు సంబంధించిన ఉద్యోగులకు సమాచారం రావడం లేదని, ప్రభుత్వం నెలాఖరులోగా ఇస్తామని చెప్పినా ఉద్యోగులకు నమ్మకం లేకుండాపోయిందని అన్నారు.సిపిఎస్ రద్దు అంటుంటే జిపిఎస్ అంటున్నారని, పాత పెన్షన్ తప్ప ఇతర ఏది తీసుకువచ్చిన మేము అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని, హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని అమలు చేయాలని అడుగుతుంటే స్పందన లేకుండాపోయిందని మండిపడ్డారు.


ఉద్యమ కార్యాచరణను చిన్న చిన్న మార్పులు చేసి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.  ఏప్రిల్ 5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపారు. మార్చి 17, 20 వ తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల సందర్శన అనంతరం, 21 నుంచి వర్క్ రూల్ కొనసాగించారు. అలాగే 26న కారుణ్య నియామకాలు కుటుంబాల సందర్శన యాత్ర కూడ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాష్ట్రస్థాయి  సమావేశం నిర్వహించుకున్నారు. ఈ క్రమంలోనే రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమం చేస్తున్న తరుణంలో సంఘాల మద్య విభేదాలు తీసుకువచ్చేందుకు  కొందరు ప్రయత్నించటం పై బొప్పరాజు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం చిత్తశుద్దిగా పని చేస్తున్నామని,తమకు పూర్తిగా సహకరించి, సమస్యల పరిష్కారానికి అంతా కలసి కట్టుగా ముందుకు రావాలని కోరారు.