Andhra Pradesh Rains | అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతోంది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం, గురువారం కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురవనున్నాయి. బుధవారం (ఆగస్టు 13న) పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు వార్నింగ్
ముఖ్యంగా మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్ళరాదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మంగళవారం రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.
కృష్ణా నదికి వరద ముప్పు – అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ఎగువ నుంచి వరద నీరు కృష్ణా నదిలోకి పోటెత్తే అవకాశం ఉండటంతో, ప్రకాశం బ్యారేజ్ పరిధిలోని ఎగువ, దిగువ ప్రాంతాల్లో 24 గంటలూ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కూడా జాగ్రత్త సూచనలు ఇవ్వాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆర్డీవోలు, ఇరిగేషన్, రెవెన్యూ, వీఎంసీ తదితర విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం, వచ్చే రెండు మూడు రోజులలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం 4-5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నది పరిసర గ్రామాల్లోని ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, నదికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పిల్లలు, పశువులు నదికి దగ్గరగా వెళ్లకుండా చూడాలని సూచించారు. మత్స్యకార గ్రామాల్లో చేపల వేటకు వెళ్లకూడదని అవగాహన కల్పించాలని, వెలగలేరు రెగ్యులేటర్ వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నదిలో ఈతకు వెళ్లకుండా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక స్థాయిలో ప్రకటనలు చేయాలని చెప్పారు. 91549 70454 నంబరుతో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించాలని, అన్ని సౌకర్యాలతో పునరావాస శిబిరాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.