Vallabhaneni Vamsi Latest News: వైఎస్ఆర్ సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు ఆయన విదేశాలకు వెళ్లిపోయారని చెబుతుండగా, మరికొంత మంది మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారని అంటున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల కిందటే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, అంతకంటే ముందే ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లుగా వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే, పోలీసులు పోలీసులు ఆయన దేశం దాటారని నిర్ధారించడం లేదు. ఈ విషయంలో ఇమిగ్రేషన్‌ అధికారులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిసింది.


2021లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన కేసులో నిందితుల్లో ఒకరిగా వల్లభనేని వంశీని చేర్చారు. ఆయన కోసం గత రెండు మూడు రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. గన్నవరం పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఏ - 21గా ఉన్న మెండెం రాంబాబు, ఏ - 50 అయిన అమరేంద్ర రెడ్డి, ఏ - 62 ఇమ్రాన్‌లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని గన్నవరానికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై పోటీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమవారం వీరిని కోర్టులో హాజరుపరుస్తారని అంటున్నారు. 


అయితే వల్లభనేని వంశీ మాత్రం ఆచూకి దొరకలేదు. వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ లో ఆయన ఉన్నారని తెలిసి 3 ప్రత్యేక పోలీసు బృందాలు ఏపీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లాయి. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగి వచ్చాయి. అయితే వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్ళారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికి కలిగిస్తోంది.


2021 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులు, వైసీపీ నాయకులను పురమాయించి టీడీపీ ఆఫీసుకు నిప్పుబెట్టించారని ఆరోపిస్తున్నారు. ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలకు నిప్పు పెట్టారు.