Andhra Pradesh Latest News : పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ టూర్‌లో రచ్చ చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ప్రత్యర్థులను నరుకుతాం, చంపుతాం, తొక్కేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించిన వారికి అరదండాలు వేశారు. టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా పోలీసులు కేసు పెట్టారు. 

వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. గత ఏడాది మృతి చెందిన పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ పర్యటన సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేలా ప్లకార్డులు ప్రదర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కర్ని నరుకుతాం అంటూ సినిమా డైలాగ్‌లతో హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగు దేశం మహిళా నేతలు వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై కంప్లైంట్ చేశారు. వాటిని తీసుకున్న పోలీసులు వీడియోలు, ఫొటోలు ఆధారంగా వైసీపీ శ్రేణులను గుర్తించారు. అరెస్టు చేశారు. 

2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మజాతరలో వేట మాదిరిగా తలలు నరుకుతామని ప్లకార్డు ప్రదర్శించిన రవితేజ అనే వైసీపీ కార్యకర్తను 88 తాళ్లూరు గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వాళ్లను కూడా గుర్తించి అరెస్టు చేస్తామని అంటున్నారు. పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు కావడంతో ప్లకార్డులు ప్రదర్శించిన వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అంబటి రాంబాబుపై కేసు నమోదు   జగన్ పర్యటన సందర్భంగా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జగన్‌ పర్యటన వేళ కొర్రపాడు వద్ద అంబటి రాంబాబు తన సోదరుడు మురళితో కలిసి హంగామా చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి బారికేడ్లు తోసేశారు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకొని తమ విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారని కేసు బుక్ చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసులు కట్టారు. 

రెంటపాళ్లలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది మందితోనే జగన్ పర్యటన చేయాలని పోలీసులు ఆదేశించారు. జనాలను నియంత్రించేందుకు కొర్రపాడు శివారులో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. ముందు జగన్ వాహనంతోపాటు కొన్ని వెహికల్స్‌ను పంపించారు. రద్దీ పెరగడంతో మిగతా వారిని అక్కడే ఆపేశారు. ఈ క్రమంలోనే రాంబాబు వాహనాలు ఎందుకు ఆపారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులవ వారిస్తున్నప్పటికీ బారికేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు. క్రౌడ్ అనుమతికి మించి ఉందని... అప్పటికే ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు చెబుతున్నా రాంబాబు వినలేదు. దీంతో ఆయనపై పోలీసులు కేసులు బుక్ చేశారు. 

గోపిరెడ్డి, సుధీర్‌పై కేసు జగన్ పర్యటనలో అనుమతి లేకుండా డీజేలు, ఇతర సౌండ్ సిస్టమ్స్ వాడినందుకు పోలీసులు కేసులు పెట్టారు. వైసీపీ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు.