Stone attack on CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఓ టీడీపీ నాయకుడిని భావిస్తుండగా.. అతణ్ని పోలీసులు విడిచిపెట్టారు. వేముల దుర్గారావు అనే టీడీపీ నాయకుడు గత నాలుగు రోజులుగా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను పోలీసులు బయటకు కనిపించకుండా చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దుర్గారావు ఆచూకీ చెప్పాలంటూ నాలుగు రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా వారు వినలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. 


దీంతో కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు కోసం వారి అడ్వకేట్ సలీం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే దుర్గారావు ఫ్యామిలీ, వడ్డెర కాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ సీపీ ఆఫీసు ఎదుట ఆందోళణ చేశారు. తన  భర్తను చూపించాలని.. దుర్గారావు భార్య శాంతి వేడుకున్నారు. చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్‌ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. మళ్లీ అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి అందరి నుంచి సంతకాలు తీసుకున్నారు.


ఈ సందర్భంగా వేముల దుర్గారావు మాట్లాడుతూ.. ఏప్రిల్16న తనను పోలీసులు అరెస్టు చేశారని.. సీఎం జగన్‌పై దాడి ఎందుకు‌ చేయించావని పోలీసులు తనను ప్రశ్నించారని దుర్గారావు చెప్పారు. ఆ ఘటనతో తనకు ఏ సంబంధం‌ లేదని చెప్పినా పోలీసులు వినడం లేదని చెప్పారు. నిందితుడైన సతీష్ తన పేరు చెప్పాడని.. అందుకే పిలిచి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సతీష్ తన పేరు ఎందుకు చెప్పాడో తనకు తెలియదని దుర్గారావు తెలిపారు.