Chandra Babu Case History: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ దొరికింది. నిన్ననే రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. నాలుగు వారాల పాటు బైయిల్‌పై ఉంది... నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గంటలలోపు జైల్లో సరండర్ కానున్నారు.
చంద్రబాబు అరెస్ట్ నుంచి బెయిల్ వరకు... సెప్టెంబర్ 9న ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు తీసుకెళ్లారు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 10వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా... ఆ రోజంగా కోర్టులో వాదనలు జరిగాయి. చివరికి 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.
సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి పదిన్నర గంటలకు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 11న విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. అటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదుల కౌంటర్ దాఖలు చేశారు. అలాగే.. చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12న చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అదే రోజు.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు లాయర్లు.
సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం రెండున్నర గంటలకు చంద్రబాబును రెండు రోజులపాటు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జైలుకు వెళ్లి చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు విచారణ జరిగింది.
సెప్టెంబర్ 24న.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబర్ 5వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 25న స్కిల్ స్కామ్‌లో క్వాష్ పిటిషన్‌ను CJI ధర్మాసనం ముందు పెట్టారు సిద్ధార్థ్ లూథ్రా. సెప్టెంబర్ 27న చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. అక్టోబర్ 5.. చంద్రబాబు రిమాండ్‌ను మరోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబర్ 9న... బెయిల్, కస్టడీ పిటిషన్లను కొట్టేసింది. అక్టోబర్ 19న జ్యుడీషియల్ రిమాండ్ మరోసారి పొడిగించింది కోర్టు. నవంబర్ 1వ తేదీ వరకు రిమాండ్ పెంచింది.
అక్టోబర్ 21న... చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులోని వెకేషన్ బెంచ్‌కి బదిలీ అయ్యింది. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అని చెప్పి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేశారు. దీంతో.. అక్టోబర్ 30న రెగ్యులర్ బెంచ్‌లోనే బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. అక్టోబర్ 30న మధ్యంతర బెయిల్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు... అక్టోబర్ 31న ఉదయం నాలుగు వారాలు పాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మధ్యంతర బెయిల్‌లో కొన్ని కండిషన్లు కూడా పెట్టింది ఏపీ హైకోర్టు. చంద్రబాబుకు మానవతా దృక్పథం, అనారోగ్య సమస్యల కారణంగా తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపిన ధర్మాసనం... ర్యాలీల్లో పాల్గొనకూడదని షరతు పెట్టింది. రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని పేర్కొంది. మీడియాతో మాట్లాడకూదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది ధర్మాసనం. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవచ్చని... అయితే.. చికిత్స వివరాలు జైలు అధికారులను సమర్పించాలని తెలిపింది. అంతేకాదు... నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గంటలలోపు జైల్లో సరండర్ కావాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు.